
ప్రధాని నరేంద్ర మోదీ వాస్తవానికి బిసి కాదని, ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత బిసి అయిన `కన్వెర్టడ్ బిసి’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొనడం పట్ల కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు . రేవంటి అవగాహనరాహిత్య వ్యాఖ్యలని మండిపడుతూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న విషయాన్ని మరచిపోయి నోటకొచ్చినట్లు అవాక్కులు, చెవాక్కులు పేలడాన్ని తీవ్రంగా ఖండించారు.
ప్రధానమంత్రి బీసీనా కాదా? అని అంశంపై ముఖ్యమంత్రి బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ చేశారు. రోజురోజుకూ రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో పట్టుకోల్పోతున్న నేపథ్యంలోఅసహనంతో రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
స్వతహాగా బీసీ వర్గానికి చెందిన వ్యక్తిగా, దేశంలో బీసీ అభ్యున్నతికి చిత్తశుద్ధితో పనిచేస్తున్న నాయకుడిగా ప్రధానమంత్రికి ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోందని ఆయన ధ్వజమెత్తారు. సామాజిక సమరసత విషయంలో బీజేపీకి, నరేంద్రమోదీకి రేవంత్ రెడ్డి సర్టిఫికెట్స్ అవసరం లేదని స్పష్టం చేశారు.
బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించిన నరేంద్రమోదీ ప్రభుత్వంకు కేంద్రమంత్రివర్గంలో 27 మంది ఓబీసీలకు, 12 మంది ఎస్సీలకు, 8 మంది ఎస్టీలకు, ఐదుగురు మైనార్టీలకు అవకాశం కల్పించిన ఘనత ఉందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు.. ఇలా సామాజిక సమరసతతో పనిచేసిన సందర్భాలున్నాయా? అని రేవంత్ లెక్క చెప్పగలరా? అని ప్రశ్నించారు.
మోదీ సర్కారు వచ్చిన తర్వాత నీట్ పరీక్షల్లో బీసీలకు 27% రిజర్వేషన్లు కలిపించినందునే ఇవాళ బీసీ తమ్ముళ్లు, చెల్లెళ్లకు ఉన్నతవిద్యాసంస్థల్లో ప్రవేశాలు లభిస్తున్నాయని తెలిపారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం బిసిలకు ఏం చేస్తోంని ఆయన ప్రశ్నించారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు రాష్ట్రమంతా అట్టహాసంగా సర్వే నిర్వహించి తమకు అన్యాయం చేశారని బీసీ సంఘాలే విమర్శలు చేస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. ఇంత అసమగ్రంగా సర్వే చేశారంటూ మండిపడుతున్నాయి.
ఎన్నికల వాగ్దానం సందర్భంగా ఐదేళ్లకు లక్షకోట్లు, ఏడాదికి 20వేల కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పి ఎంతవరకు పూర్తిచేశారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండని కిషన్ రెడ్డి ముఖ్యమంత్రికి హితవు చెప్పారు. నామినేటెడ్ పోస్టుల విషయంలోనూ బీసీలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? 75 ఏళ్లో ఒక్క బీసీనైనా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేసిందా? అని ఆయన నిలదీశారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన పార్టీ బీజేపీ అని ఆయన గుర్తు చేశారు.
More Stories
బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అరెస్ట్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం
బంగారు లక్ష్మణ్ కు ఘనంగా నివాళులు