ఇప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కు 78, ఎన్డీయేకు 343

ఇప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కు 78, ఎన్డీయేకు 343

* ఇండియూ టుడే – సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే

దేశంలో ఇప్పటికిప్పుడే ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ సొంతంగానే సాధారణ మెజారిటీ సాధించనుంది. మరోవంక దేశంలో కాంగ్రెస్‌ పార్టీకి ఆదరణ తగ్గుతోందని ఓ సర్వేలో వెల్లడైంది. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పుంజుకున్న కాంగ్రెస్‌ ఆ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తాపడిన విషయం తెలిసిందే. గెలుస్తుందనుకున్న రాష్ట్రాల్లో కూడా ఘోర పరాభవం మూటగట్టుకుంది. దీంతో ఇక కాంగ్రెస్‌ పని అయిపోయిందని అంతా భావిస్తున్నారు. 

ఈ సమయంలో ఓ సంస్థ చేపట్టిన సర్వేలో కూడా ఇదే విషయం వెల్లడైంది. ఇప్పుడు ఎన్నికలు పెడితే గత ఎన్నికల్లో సెంచరీకి చేరువగా వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు పెడితే ఆ దరిదాపుల్లోకి కూడా వచ్చే పరిస్థితి లేదని తేలింది. 542 స్థానాలకు గానూ కేవలం  78కి పరిమితమయ్యే అవకాశం ఉందని ఇండియా టుడే, సీఓటర్‌ సంయుక్తంగా నిర్వహించిన `మూడ్ అఫ్ ది నేషన్’ పోల్ వెల్లడించింది.

ఇక ఇదే సర్వేలో బీజేపీకి ఆదరణ క్రమంగా పెరుగుతున్నట్లు వెల్లడైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ఎన్డీయే కూటమి 300 పైచిలుకు సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఇందులో బీజేపీ సొంతంగా 281 స్థానాలు గెలుచుకుంటుందని పేర్కొంది. ఈ ఏడాది జనవరి 2 నుంచి ఫిబ్రవరి 9 వరకు దేశవ్యాప్తంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో 1,25,123 మందిని ప్రశ్నించి, వారి అభిప్రాయాలను సేకరించినట్లు తెలిపింది.

2024 ఎన్నికల్లో ‘అబ్‌ కీ బార్‌.. 400 పార్‌’ అన్న నినాదంతో బీజేపీ ప్రచారం చేయగా చివరికి 292 స్థానాల్లో మాత్రమే ఎన్డీయే గెలిచింది. అయితే, ఎన్నికలు పూర్తయిన ఆరు నెలల తర్వాత ప్రస్తుతం బీజేపీ గణనీయంగా పుంజుకుందని, ఎన్డీయే కూటమికి ప్రజాదరణ పెరిగిందని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వెల్లడించింది. 

మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం బీజేపీ క్యాడర్‌లో జోష్ పెంచిందని తెలిపింది. ఈ క్రమంలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయే కూటమి 343 సీట్లలో విజయ ఢంకా మోగిస్తుందని చెప్పింది. ఇక మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 232 సీట్లు గెలుచుకున్న ఇండియా కూటమి (ప్రస్తుతం 188 సీట్లను దక్కించుకుంటుందని పేర్కొంది.

కాంగ్రెస్ పార్టీ పార్టీ 99 స్థానాల నుంచి 78 స్థానాలకు పడిపోవచ్చని ఈ సర్వే తెలిపింది. బీజేపీకి గత ఎన్నికల్లో 41 శాతం ఓట్లు వచ్చాయి. అయితే.. అవి మరో 3 శాతం పెరిగే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా బీజేపీ హవా పెరుగుతుండగా, కాంగ్రెస్ ప్రాభవం పడిపోతోందని పేర్కొంది. తాజా సర్వే ప్రకారం ఎన్డీఏ కూటమి ఓటు షేర్ మూడు శాతం పెరిగే అవకాశం ఉంది. ఇక ఇండియా కూటమి 1 ప‌ర్సంట్ ఓటు శాతం పెరిగే అవకాశం ఉంది.