భారత్‌లో ఎన్నికలపై అపోహను తొలగించిన 2024

భారత్‌లో ఎన్నికలపై అపోహను తొలగించిన 2024
2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో భారత్‌లో ఏకపక్షంగా ఉంటాయనే ఓ అపోహను సైతం తొలగించాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. ఆ క్రమంలో దేశంలోని రాష్ట్రాలను పరిశీలిస్తే చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని తెలిపారు. బీబీసీ నిర్వహించే హార్డ్ టాక్‌ కార్యక్రమంలో ఆ సంస్థ ప్రతినిధి స్టీఫెన్ సకూర్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ  ప్రాంతీయ పార్టీలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపాయని, అవి రాష్ట్రాలను సైతం పాలిస్తున్నాయని సోదాహరణగా వివరించారు.

ప్రధాని మోదీ ప్రభుత్వ హయాంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా మీరేమైనా రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కోవలసి వచ్చిందా? అంటూ అధికార బీజేపీ తన సొంత రక్షణ కోసం కోర్టుపై మొగ్గు చూపిందంటూ న్యూయార్క్ టైమ్స్ సంపాదకీయాన్ని బీబీసీ ప్రతినిధి సకూర్ ఉటంకిస్తూ ప్రశ్నించగా ఈ సమాధానం ఇచ్చారు.   భారత న్యాయవ్యవస్థలో రాజకీయ జోక్యం ఆరోపణలపై స్పందిస్తూ చట్ట ప్రకారమే తీర్పులు వెలువరించినట్లు చెప్పారు.

న్యాయవ్యవస్థ చట్టబద్ధమైన పాలనను సమర్థించడం, ప్రతి పౌరుడి హక్కులు పరిరక్షించబడేలా చూసుకోవడం కోసం కట్టుబడి ఉంటుందని తేల్చి చెప్పారు. పరువు నష్టం కేసులో లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి శిక్ష విధించడంపై ప్రశ్నించగా సుప్రీంకోర్టు తీర్పును ఆ తర్వాత పాజ్ చేసిందని గుర్తు చేశారు. భారత న్యాయ వ్యవస్థపై ప్రజలకు అచంచలమైన విశ్వాసం ఉందని తెలిపారు.

జమ్మూ కాశ్మీర్‌ ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370ని సుప్రీంకోర్టు తన తీర్పు ద్వారా రద్దు చేసింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ప్రముఖ న్యాయవాదులంతా తీవ్ర నిరాశకు గురయ్యారని బీబీసీ ప్రతినిధి పేర్కొనగా దీనికి జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పందిస్తూ జమ్మూ కాశ్మీర్‌లో ప్రజాస్వామ్య ప్రక్రియను పునరుద్ధరించారని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రస్తుతం అమలులో ఉందని ఆయన గుర్తు చేశారు. 

శాంతియుతంగా అధికారం బదలాయింపు జరిగిందని చెబుతూ జమ్మూ కాశ్మీర్‌లో ప్రజాస్వామ్యం విజయవంతమైందనడానికి ఇది ఒక స్పష్టమైన సూచిక అని ఆయన అభివర్ణించారు. ఇక గతేడాది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో గణేష్ చతుర్ధి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. 

ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రశ్నించగా ఇటువంటి అంశాల్లో అత్యున్నత రాజ్యాంగ సంస్థలు మన వ్యవస్థలో హుందాగా వ్యవహరిస్తోందని తాను భావిస్తానని ఆయన స్పష్టం చేశారు. 

ప్రధాని తన ఇంటికి రావడంలో ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేదని చెప్పారు. ‘రాజ్యాంగ పరంగా ఉన్నత పదవుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం, మర్యాదపూర్వక భేటీలు ఉంటాయి. వాటిని అంతకు మించి లోతుగా చూడొద్దు. కేసుల తీర్పులకు ఇలాంటి మర్యాదలకు ఏమాత్రం సంబంధం ఉండదనే పరిణతి మా వ్యవస్థలో ఉంది. ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి’ అని తెలిపారు.

భారత న్యాయవ్యవస్థ ఉన్నత వర్గాలు, హిందూ అగ్రవర్ణ పురుషుల ఆధిప్యంలో ఉందా? అని స్టీఫెన్ సకూర్ ప్రశ్నకు జస్టిస్ చంద్రచూడ్ ఏకీభవించలేదు. దేశ న్యాయ వ్యవస్థకు మూలాధారమైన జిల్లా న్యాయ వ్యవస్థను ఓ సారి పరిశీలిస్తే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చేరే వారిలో 50 శాతానికి పైగా మహిళలు ఉన్నారని తెలిపారు. 

అంతేకాదు దేశంలో 60 నుంచి 70 శాతం మేర మహిళలు న్యాయ వ్యవస్థలో చేరుతోన్నారని ఆయన వివరించారు. దేశంలో మహిళలకు సైతం న్యాయ విద్య చేరువైందని చెప్పారు. జిల్లా స్థాయి న్యాయ వ్యవస్థలో మహిళ సంఖ్య పెరుగుతోందని,  అలాగే మహిళలు సైతంపైకి ఎదుగుతోన్నారని ఆశాభవం వ్యక్తం చేశారు.  అదీకాక తన తండ్రి వైవీ చంద్రచూడ్ తాను భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నంత కాలం న్యాయస్థానంలో అడుగు పెట్ట వద్దని తనతో తరచూ చెప్పే వారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. అందుకే తాను హార్వర్డ్ లా స్కూల్‌‌లో మూడు సంవత్సరాలు చదువుకొన్నానని తెలిపారు. 

అలా తన తండ్రి పదవీ విరమణ అనంతరం తాను తొలిసారిగా కోర్టులో అడుగు పెట్టానని చెప్పారు. దేశ న్యాయ వ్యవస్థను ఓ సారి పరిశీలిస్తే.. చాలా మంది న్యాయవాదులు, న్యాయమూర్తులు ఈ వృత్తిలోని తొలిసారి ప్రవేశించిన వారేనని ఆయన పేర్కొన్నారు.