మాఘ పూర్ణిమ వేళ కుంభమేళాకు పోటెత్తిన భక్తులు

మాఘ పూర్ణిమ వేళ కుంభమేళాకు పోటెత్తిన భక్తులు
మాఘ పూర్ణిమ సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభమేళా భక్తజన సంద్రమైంది. లక్షలాదిగా తరలివస్తున్న భక్తులతో త్రివేణీ సంగమంలో ఘాట్‌లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. బుధవారం ఉదయం 6 గంటల వరకు 73 లక్షలకు పైగా ప్రజలు పుణ్యస్నానాలు చేశారని ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు పుణ్యస్నానాలు చేసినవారి సంఖ్య 46.25 కోట్లు దాటిందని ప్రకటించింది.

మాఘపూర్ణిమ పర్వదినం సందర్భంగా మంగళవారం నుంచి కొనసాగుతున్న భక్తుల రద్దీ, బుధవారం నాటికి మరింత పెరిగిపోయింది. భక్తులపై హెలికాఫ్టర్‌ నుంచి పూలవర్షం కురిపించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఉత్తర్‌ప్రదేశ్ సర్కార్ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లఖ్‌నవూ నుంచి ఏర్పాట్లను, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. 

ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, పార్కింగ్​కు కేటాయించిన స్థలాలను మాత్రమే ఉపయోగించాలని మహాకుంభమేళా పరిపాలన యంత్రాంగం భక్తులను అభ్యర్థించింది. మాఘపూర్ణిమ స్నానంతో నెలరోజుల దీక్షకు కల్పవాసీలు ముగింపు పలికారు. ఉదయం 6 గంటలకు వరకూ 10 లక్షల మంది కల్పవాసీలు సహా 73.60 లక్షల మందికిపైగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్లు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. 

మాఘ పూర్ణిమ సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోకి వాహనాల ప్రవేశాన్ని నిషేధించిన పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వసంత పంచమి కంటే ఎక్కువగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కుంభ్ ఎస్ ఎస్ పి రాజేష్ ద్వివేది చెప్పారు. రద్దీ నిర్వహణ క్లిష్టంగా ఉన్న ప్రదేశాలలో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించినట్లు ప్రయాగ్‌రాజ్‌ ఏడీజీ భాను భాస్కర్ తెలిపారు. 

టోల్ ప్లాజాలు, పొరుగు జిల్లాల అధికారుల నుంచి కుంభమేళాకు వచ్చే వాహనాల సంఖ్యను సేకరించి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. మత విశ్వాసం ప్రకారం ఈరోజు దేవతలు భూమిపై వస్తూ త్రివేణి సంగమంలో స్నానం చేస్తారని, తద్వారా భక్తులు శాంతిని, మోక్షాన్ని పొందగలుగుతారని ఇంకొంత మంది పండితులు అంటున్నారు. అందుకే మహాకుంభమేళాలో ఈ రోజు స్నానం అత్యంత పవిత్రమైన రాజస్నానంగా పరిగణించబడుతుందని చెబుతున్నారు.