చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా

చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా

* ఇంగ్లాండ్​తో తొలి వన్డేలో భారత్​ ఘన విజయం

టీమిండిమా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించారు. అన్ని ఫార్మాట్లలో కలిపి 6,000 పరుగులు, 600 వికెట్లు తీసిన ఏకైక భారత స్పిన్నర్‌గా నిలిచాడు. ఈ ఫీట్ సాధించిన రెండో క్రికెటర్ గా జడేజా రికార్డు నెలకొల్పాడు. జడేజా కంటే ముందు భారత లెజండరి క్రికెటర్ కపిల్ దేవ్ ఈ అరుదైన ఘనత సాధించారు. 

నాగ్‌పూర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఆదిల్ రషీద్ వికెట్‌ తీసి జడేజా ఈ ఘనత సాధించారు. జడేజా 6641 పరుగులు చేయగా, కపిల్ 9031 పరుగులు చేశాడు. మొత్తం మీద, కపిల్, వసీం అక్రమ్, షకీబ్ అల్ హసన్, డేనియల్ వెట్టోరి, షాన్ పొల్లాక్ తర్వాత ఈ ప్రత్యేకమైన ఘనత సాధించిన ఆరవ క్రికెటర్ జడేజా.

అంతర్జాతీయ క్రికెట్‌లో 600 వికెట్లు తీసిన ఐదవ భారత బౌలర్ గా రవీంద్ర జడేజా నిలిచాడు.  అతని కంటే ముందు అన్ని ఫార్మాట్లలో కలిపి 600 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఇతర భారతీయ క్రికెటర్లు అనిల్ కుంబ్లే (953), రవిచంద్రన్ అశ్విన్ (765), హర్భజన్ సింగ్ (707), కపిల్ దేవ్ (687) ఉన్నారు.

మరోవైపు ఇంగ్లండ్-భారత్ మధ్య జరిగిన వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ జడేజా రికార్డు సాధించారు. ఇప్పటివరకు ఆయన 41 వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో జేమ్స్ అండర్సన్(40)ను జడ్డూ అధిగమించాడు. మొత్తం మీద, జడేజా టెస్ట్‌లలో 323 వికెట్లు, వన్డేలలో 223 వికెట్లు మరియు టీ20లలో 54 వికెట్లు తీసుకున్నాడు. 2024 టీ20 ప్రపంచ కప్‌లో విజయం సాధించిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో పాటు టీ20ల నుండి జడేజా రిటైర్ అయ్యాడు.

ఇలా ఉండగా, ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమ్​ఇండియా విజయం సాధించింది. ఇంగ్లాండ్‌తో జరిగిన 5 మ్యాచ్​ల టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్​ వన్డే సిరీస్‌లోను కూడా శుభారంభం చేసింది. ఇంగ్లిష్‌ జట్టుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నాగ్‌పుర్‌ వేదికగా జరిగిన తొలి ఓడీఐలో 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 249 పరుగుల లక్ష్యాన్ని 38.4 ఓవర్లలో ఛేదించింది. 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 

యంగ్​ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్‌(87), శ్రేయస్‌ అయ్యర్‌ (59), అక్షర్‌ పటేల్‌ (52) అర్ధశతకాలు బాదారు. కాగా, ఓపెనర్లు యశస్వి జైస్వాల్(15), రోహిత్ శర్మ(2) నిరాశ పరిచారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో మహమూద్‌, రషీద్‌కు చెరో 2 వికెట్లు, ఆర్చర్‌, బెతెల్‌ తలో వికెట్‌ తీశారు. 249 పరుగుల సాధారణ లక్ష్యంతో బ్యాటింగ్​కు దిగిన టీమ్ఇండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 

జోఫ్రా ఆర్చర్‌ వేసిన ఐదో ఓవర్లో ఓపెనర్‌ యశస్వ జైస్వాల్‌(15) షాట్‌కు ప్రయత్నించి కీపర్‌ చేతికి చిక్కాడు. ఆ తర్వాతి ఓవర్లోనే జట్టు సారథి రోహిత్‌ శర్మ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. అయితే వన్ డౌన్‌లో వచ్చిన శుభ్‌మన్‌ గిల్‌ క్రీజులో పాతుకుపోయాడు. సెకండ్ డౌన్‌లో వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 

వీరిద్దరూ మూడో వికెట్‌కు 113 పరుగులు జోడించారు. ఇద్దరూ హాఫ్​ సెంచరీలు బాదారు. మిడిలార్డర్‌లో వచ్చిన రాహుల్‌ (2)- రషీద్‌ బౌలింగ్‌లో కాట్‌ అండ్‌ బౌల్డ్‌గా పెవిలియన్ చేరాడు. అక్కడికి స్వల్ప వ్యవధిలోనే మహమూద్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ట్రై చేసి గిల్‌ బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం హార్దిక్‌ పాండ్య (9), రవీంద్ర జడేజా (12) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడి టార్గెట్​ను ఛేందించారు.