
అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన అక్రమ వలసదారుల పూర్వాపరాలపై విచారణ జరిపిస్తామని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ స్పష్టం చేశారు. వాళ్లు అక్రమంగా ఎలా తరలి వెళ్లారు? ఏజెంట్లు ఎవరు? అనే విషయాలపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని ఆయన వెల్లడించారు. విదేశాల్లో తమ పౌరులు చట్టవిరుద్ధంగా నివసిస్తోన్నట్లు తేలితే వారిని స్వదేశానికి రప్పించుకోవాల్సిన బాధ్యత ఆయా దేశాలపైనే ఉంటుందని కూడా తేల్చి చెప్పారు.
అమెరికా అక్రమ వలసదారులను తిరిగి స్వదేశానికి పంపుతోన్న తరుణంలో.. వారి పట్ల ఆ దేశం వ్యవహరిస్తున్న తీరుపై రాజ్యసభలో ప్రతిపక్షాలు గురువారం తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. వలసదారులకు సంకెళ్లు వేసి పంపిస్తున్నారని విపక్షాలు చేస్తున్న విమర్శలపై కేంద్ర మంత్రి స్పందిస్తూ విమానంలో వారిని తిరిగి తీసుకు వస్తున్న తరుణంలో వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించడం మాత్రం సరికాదని స్పష్టం చేశారు.
విదేశాలల్లో చట్టవిరుద్దంగా నివసిస్తున్నట్లు తేలితే తమ పౌరులను తిరిగి తీసుకు రావడం అన్ని దేశాల ప్రాథమిక బాధ్యత అని మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. అయితే ఇలా దేశం నుంచి వెనక్కి పంపుతోన్న వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించకుండా ఉండాలని పేర్కొంటూ అమెరికా అధికారులతో తాము సంప్రదింపులు జరుపుతోన్నట్లు ఆయన తెలిపారు.
అమెరికాలో బహిష్కరణ వ్యవహారాన్ని ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అథారిటీ పర్యవేక్షిస్తుందని, ఇది- 2012లో అమలులోకి వచ్చిందని చెప్పారు. ఈ అథారిటీ- కొన్ని స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొటోకాల్స్‌ను రూపొందించిందని, బహిష్కరణకు గురైన వారిని ఆ దేశమే విమానాల ద్వారా తరలించాలంటూ అక్కడి నిబంధనలు స్పష్టం చేస్తోన్నాయని జైశంకర్ వివరించారు.
మహిళలు, పిల్లలను ఇందులో నుంచి మినహాయించినట్లు తెలిపారు. బహిష్కరణ ప్రక్రియ కొత్తదేమీ కాదని స్పష్టం చేశారు. స్వదేశానికి వచ్చిన అక్రమ వలసదారులు అమెరికాకు ఎలా వెళ్లగలిగారనే విషయంపై ఆరా తీయడానికి అమెరికాతో కలిసి పనిచేస్తున్నామని, అక్కడి నుంచి సమగ్ర వివరాలను తెప్పించుకుంటోన్నా మని కేంద్ర మంత్రి చెప్పారు.
చట్టబద్ధంగా ఏ దేశానికైనా వెళ్లే హక్కు అందకీ ఉందన, అక్రమంగా వలస వెళ్లాలనుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. ఎలాంటి డాక్యుమెంట్లు, అధికారిక పత్రాలు, వీసాలు.. లేకుండా అసలు వాళ్లు అమెరికాకు ఎలా వెళ్లారనే విషయంపై ఆరా తీయాలంటూ ఆదేశాలను జారీ చేసినట్లు జైశంకర్ తెలిపారు.
కాగా, అమెరికా నుంచి బహిష్కరణకు గురైన భారతీయుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు విమర్శించారు. అక్రమ వలసదారుల పట్ల వ్యవహరించిన తీరు పట్ల ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు. ఈ ప్రయాణంలో తమ చేతులకు సంకెళ్లు వేశారని, అమృత్‌సర్ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం తమ చేతులకు ఉన్న సంకెళ్లు విప్పారంటూ అక్రమ వలసదారులు పేర్కొన్నారు.
అదీకాక ఈ వ్యవహారంపై కాంగ్రస్ పార్టీ ఎంపీలు మల్లికార్జున్ ఖర్డే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌తోపాటు ఇతర ప్రతిపక్ష ఎంపీలు అమెరికా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు నిరసనగా.. పార్లమెంట్‌లో ప్రదర్శన నిర్వహించారు. అలాగే మరికొంత మంది నాయకులు అయితే చేతులకు సంకెళ్లు ధరించారు.
మరోవైపు లోక్‌సభలో.. యూఎస్‌లో అక్రమంగా నివసిస్తున్న వారిని తిరిగి స్వదేశానికి పంపడంపై కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, గౌరవ్ గోగొయ్‌లతోపాటు కేసీ వేణుగోపాల్ ఇచ్చిన వాయిదా తీర్మానానికి సంబంధించి నోటీసులు అందజేశారు.
More Stories
వినోద్ కుమార్ శుక్లాకు జ్ఞాన్‌పీఠ్ అవార్డు
డాలర్ ను బలహీనం చేసే ఉద్దేశ్యం భారత్ కు లేదు
నాగ్‌పుర్ హింస వెనుక బంగ్లాదేశ్ హస్తం?