
ఆవిష్కరణలకు పెద్ద పీట వేస్తూ ప్రజాసంక్షేమాన్ని సమతుల్యం చేసే విధానాన్ని రూపొందించేందుకు నిర్వాహక సంస్థలు బాధ్యత వహించాలని సర్వే సూచించింది. నిర్వాహక సంస్థలు ఆవిష్కరణలపై పరిమితులు విధించడం, సాంకేతికత కోసం సంకుచిత విధానాలను నిర్దేశించడం సరికాదని స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వ యంత్రాంగం అవకాశం వచ్చినపుడు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు సంబంధించి కొంత జ్ఞానాన్ని ప్రదర్శించాలని పేర్కొంది. దీంతో సాంకేతిక పరంగా ఎదురయ్యే ప్రతికూలతలను తగ్గించవచ్చని తెలిపింది.
ఎఐ వినియోగం సామాజిక విలువలకు అనుగుణంగా ఉండేలా, జవాబుదారీ తనం, పారదర్శకతతో కూడిన ఆవిష్కరణలను సమతుల్యం చేసేలా రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌లను పున:సమీక్షించడం, సవరించడం అవసరమని సర్వే తెలిపింది. 13వ అధ్యాయంలో ‘ఎఐ యుగంలో శ్రామిక శక్తి : సంక్షోభం లేదా ఉత్ప్రేరకం’ అనే శీర్షికతో కార్పోరేట్ రంగం సామాజిక బాధ్యతను అధిక స్థాయిలో చూపాలని పేర్కొంది.
ఒకవేళ కంపెనీలు ఎఐ సాంకేతికతను ఎక్కువ కాలం పాటు అభివృద్ధి చేయకపోతే, సమర్థవంతంగా నిర్వహించకపోతే, విధాన పరమైన జోక్యం కోసం డిమాండ్, ఆర్థిక వనరులపై డిమాండ్ ఎదుర్కోవాల్సి వుంటుందని సర్వే పేర్కొంది. పరిశ్రమలు- విద్యాభాగస్వామ్యాల భవిష్యత్తు కోసం రోడ్ మ్యాప్ తప్పనిసరి అని, నిరంతరం నైపుణ్యాభివృద్ధికి, ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వ శ్రామిక శక్తిని సృష్టించేందుకు అనువైన శిక్షణా నమూనాలకు ప్రాధాన్యత నివ్వాలని సూచించింది.
నైపుణ్యాభివృద్ధి సాధించడానికి కీలక రంగాల శ్రద్ధ, జోక్యం అవసరమని తెలిపింది. ప్రతి సాంకేతిక విప్లవం అతిపెద్ద రంగాల్లోని శ్రామిక శక్తిని తొలగించడంతో పాటు ఆర్థిక అసమానతకు దారితీసిందని వాదిస్తూ .. ఇటువంటి పరిస్థితి ప్రమాదకర స్థాయిలో నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్న భారతదేశానికి ప్రమాదకరమని సర్వే పేర్కొంది.
2023-24 సర్వేలో పేర్కొన్నట్లు పెరుగుతున్న శ్రామిక శక్తికి అనుగుణంగా భారత్ 2030 నాటికి వ్యవసాయేతర రంగంలో ఏడాదికి సగటున 78.5 లక్షల ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంటుంది. భారత్ ప్రధానంగా సేవల ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఐటిలో గణనీయమైన వాటాను కలిగి ఉంది. అలాగే తక్కువ విలువ కలిగిన సేవల్లో శ్రామిక శక్తి ఉంది.
ఇటువంటి ఉద్యోగాలు యాంత్రీకరణకు గురవుతాయి. ఖర్చులను తగ్గించుకునే క్రమంలో సంస్థలు శ్రామిక శక్తిని తొలగించే అవకాశం ఉంటుందని పేర్కొంది. భారతదేశం వినిమయ శక్తిపైన ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ. కార్మికులను తొలగిస్తే వినిమయ శక్తి పడిపోయి ఆర్థికపరమైన చిక్కులను ఎదుర్కొంటుంది.
ఇటువంటి అధ్వాన్నమైన విధానాలు కార్యరూపం దాలిస్తే దేశ ఆర్థిక వృద్ధి తిరోగమనంలోకి జారిపోతుందని సర్వే హెచ్చరించింది. దేశ సేవల ఆధారిత ఆర్థిక వ్యవస్థ యువత, జనాభాతో కలిసి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక ప్రయోజనాలను సక్రమంగా అమలు చేస్తేనే ఫలితాలు సమర్థవంగా ఉంటాయని సర్వే సూచించింది.
More Stories
డాలర్ ను బలహీనం చేసే ఉద్దేశ్యం భారత్ కు లేదు
బంగ్లాదేశ్ హిందువులకు సంఘీభావంకై ఆర్ఎస్ఎస్ పిలుపు
అంతరిక్షంలో భగవద్గీత, గణేశుడితో సునీత