
అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన బైఔట్ ప్యాకేజీ సత్ఫలితానిస్తోంది. దాదాపు 40వేల మంది ఉద్యోగులు తమ కొలువులకు రాజీనామా చేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. బైఔట్ ప్రకారం ఉద్యోగం వదులుకునేవారికి సెప్టెంబరు వరకు వేతనం చెల్లిస్తారు.
మొదట్లో సీఐఏ బై ఔట్ పరిధిలోకి లేకపోయినా ఇప్పుడు ఆ విభాగం ఉద్యోగులను కూడా చేర్చారు. ప్రభుత్వంలో అనవసర ఖర్చులను తగ్గించే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాల్లో ఈ బైఔట్ ఒకటి. దీని ప్రకారం ఉద్యోగులు తమ కొలువులకు రాజీనామా చేస్తే సెప్టెంబరు వరకు పనిలేకుండా వేతనంతోపాటు పలు రకాల ప్రయోజనాలు కల్పిస్తారు.
ఈ మేరకు ది ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్-ఓఎమ్సీ దాదాపు 20లక్షల మంది ఉద్యోగులకు మెయిల్ పంపించింది. ఫిబ్రవరి 6లోపు నిర్ణయం తీసుకోవాలని అందులో పేర్కొంది. బైఅవుట్‌ను తిరస్కరించేవారి ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని కూడా హెచ్చరించింది. బై ఔట్ ను ఎంచుకోకుంటే భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించాలని ట్రంప్ కార్యవర్గం భావిస్తోంది.
మొదట్లో గూఢచర్య సంస్థ- సీఐఏను బైఔట్లో చేర్చలేదు. తాజాగా సీఐఏ ఉద్యోగులకు కూడా బైఔట్ వర్తిస్తుందని ఆ సంస్థ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్ తమ ఉద్యోగులకు అంతర్గతంగా సందేశాలు పంపారు. కాగా, బై ఔట్ ను అమెరికా ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆ ఆఫర్‌ను ఎంచుకోవద్దని ఉద్యోగులకు సూచిస్తున్నాయి. బైఅవుట్ చట్టబద్ధతపై ఉద్యోగ సంఘాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
బైఅవుట్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య మసాచుసెట్స్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గతేడాది చివరినాటికి అమెరికాలో 30లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని అంచనా. 2శాతం మంది ఉద్యోగులు బైఅవుట్‌ను ఎంచుకున్నా ప్రభుత్వ పాలన, ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
More Stories
విద్యాశాఖను మూసివేసిన ట్రంప్
ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష?
గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడి…85 మంది మృతి