కొందరు నాయకులు అర్బన్ నక్సలైట్లలా మాట్లాడుతున్నారు

కొందరు నాయకులు అర్బన్ నక్సలైట్లలా మాట్లాడుతున్నారు
ఢిల్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా తాము బీజేపీ, ఆరెస్సె్‌సతోపాటు భారత రాజ్యంపై యుద్ధం చేస్తున్నామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన వాఖ్యాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ‘‘కొందరు వ్యక్తులు యుద్ధాన్ని ప్రకటిస్తున్నామని బహిరంగంగా చెబుతున్నారు. అర్బన్‌ నక్సలైట్లలా మాట్లాడుతున్నారు. చేతిలో రాజ్యాంగాన్ని పెట్టుకుని తిరుగుతారు. అయితే.. వారికి రాజ్యాంగం అర్థంకాదు. దేశ సమైక్యత గురించి తెలియదు’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ  దుయ్యబట్టారు. 
 
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ.. రాష్ట్రపతి ప్రసంగాన్ని ‘బోర్‌’ అని రాహుల్‌ అనడంపైనా ప్రధాని స్పందించారు. గుడిసెల్లో ఫొటో సెషన్లకు ఫోజులిచ్చేవారికి పేదల బాధలు అర్థంకావని పేర్కొంటూ అందుకే పార్లమెంట్‌లో పేదల గురించి మాట్లాడితే.. సోనియా, రాహుల్‌కు ‘బోర్‌’కొడుతుందని ఎద్దేవా చేశారు. 
 
అటు ఆప్‌ ఆప్ అరవింద్‌ కేజ్రీవాల్‌ను కూడా మోదీ మాటలతో విరుచుకుక్ పడ్డారు. ‘‘ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించే కొన్ని పార్టీలతో యువతకు ‘ఆప్‌’ద పొంచి ఉంది. వారు అద్దాల మేడ నిర్మాణానికి అవినీతికి పాల్పడతారు’’ అంటూ ధ్వజమెత్తారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ పాలనపైనా దుమ్మెత్తిపోశారు. ‘గరీబీ హఠావో’ అనే నినాదాన్ని 50 ఏళ్లు కొనసాగించినా సాధించలేనిది తమ ప్రభుత్వం చేసి, చూపించిందని స్పష్టం చేశారు. 
 
గడిచిన పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చామని వివరించారు. 4 కోట్ల మంది పేదలకు సొంత ఇళ్లను ఇచ్చామని, 12 కోట్ల మంది పేదలకు మరుగుదొడ్లను కట్టించామని, వారి బాధలను అర్థం చేసుకున్నాం కాబట్టే ఇదంతా చేశామని వ్యాఖ్యానించారు. రాజీవ్‌గాంధీ 21వ శతాబ్ది పేరుతో గాలిమేడలు(హవాహవాయీ) నిర్మించారే తప్ప పరిస్థితులు మాత్రం 20వ శతాబ్దంలోనే ఉండేవని పేర్కొన్నారు. పేదల అభ్యున్నతిపైనా దృష్టి సారించలేదని ధ్వజమెత్తారు.
“రాష్ట్రపతి ప్రసంగం మాలో ఆత్మవిశ్వాసం నింపింది. వరుసగా మూడోసారి అధికారం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు. వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా మా ప్రభుత్వం పని చేస్తోంది. కీలక నిర్ణయాల ద్వారా ఆదా అయిన డబ్బుతో ఇతరుల (పరోక్షంగా కేజ్రీవాల్‌ను ఉద్దేశించి ) మాదిరిగా అద్దాలమేడ నిర్మించుకోలేదు. అవినీతి నిర్మూలన చర్యలతో ఆదా అయిన డబ్బు దేశాభివృద్ధికి వినియోగించాం” అని ప్రధాని స్పష్టం చేశారు. 
 
“ఐదు దశాబ్దాల వరకు గరీబీ హఠావో నినాదం వింటూ వచ్చాం. ఇప్పుడు 25కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. క్రమబద్ధంగా, అంకితభావంతో, చిత్తుశుద్ధితో పేదల కోసం జీవితాన్ని అంకితం చేస్తే ఇది సాధ్యమవుతుంది. పేదలకు అసత్య నినాదాలు కాదు. మేం అసలైన అభివృద్ధి చూపించాం”అంటూ తమ ప్రభుత్వ విజయాలను వివరించారు.
 
 ‘‘అప్పట్లో కేంద్రం నుంచి గ్రామ సచివాలయం వరకు ఒకే పార్టీ పాలన ఉండేది. అయినా.. కేంద్రం ఇచ్చే రూ.1 పేదలకు అందేసరికి 15 పైసలుగా మారేది. మేం నగదు బదిలీని తీసుకొచ్చాం. కేంద్రం ఇచ్చే ప్రతి రూపాయిని లబ్ధిదారులకు చేరేలా చేశాం’’ అని పేర్కొన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌తో పేదలందరికీ ఆరోగ్యభాగ్యాన్ని కలిగించామని, కొన్ని రాష్ట్రాలు మాత్రం ఈ పథకాన్ని వినియోగించుకోవడంలేదని విమర్శించారు. 
 
పదికోట్ల నకిలీ ఖాతాలను స్తంభింపజేశామని, ఇథనాల్‌ బ్లెండింగ్‌ ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదాచేశామని ప్రధాని తెలిపారు. ‘‘గతంలో తరచూ రూ.లక్షల కోట్ల అవినీతిపై వార్తలు వచ్చేవి. గడిచిన పదేళ్లలో మా సర్కారు హయాంలో ఎలాంటి అవినీతి ఆరోపణల్లేవు. కేంద్రంలో పదేళ్లుగా అవినీతి లేకపోవడంతో ప్రజలు లబ్ధిపొందారు’’ అని మోదీ తెలిపారు. హర్యానాలో తమ పార్టీ ట్రాక్ రికార్డును ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. నిరుడు మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో బిజెపి సాధించిన అఖండ విజయాలను మోడీ శ్లాఘించారు.