
తెలంగాణలోని ఎస్సీలను మూడు గ్రూపులుగా వర్గీకరించాలని ఈ అంశంపై నియమించిన ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి సూచించినట్టు తెలిసింది. గతంలోలా ‘ఏ బీ సీ డీ’గా కాకుండా ఇప్పుడు ‘ఏ బీ సీ’ గ్రూపులుగా వర్గీకరించాలని ప్రభుత్వానికి సమర్పించిన తన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.
ఆయా గ్రూపుల్లో మాదిగ, మాల సహా మిగిలిన ఉప కులాల జనాభా శాతం, వాటికి ఇప్పటి వరకు వివిధ రంగాల్లో దక్కిన అవకాశాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లను కేటాయించాలని నివేదికలో పొందుపరిచినట్టు సమాచారం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే.
ఆ కమిషన్ తన నివేదికను సోమవారం ఎస్సీ సంక్షేమ శాఖకు అందించగా, ఆ శాఖ అధికారులు దానిని మంత్రివర్గ ఉప సంఘానికి సమర్పించారు. నివేదికపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని ఉప సంఘం సోమవారం మధ్యాహ్నం, సాయంత్రం రెండు దఫాలుగా సమావేశమై నివేదికలోని పలు అంశాలను పరిశీలించి చర్చించింది. దీనిలో సభ్యులుగా మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్, ఎంపీ మల్లు రవి ఉన్న విషయం తెలిసిందే.
అనంతరం సబ్ కమిటీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నివేదికలోని విషయాలను వివరించింది. మంగళవారం ఆ నివేదికను తొలుత క్యాబినెట్‌లో; అనంతరం శాసనసభలో ప్రవేశపెట్టి చర్చ చేయనున్నారు. ఆయా కులాల్లోని విద్య, ఉపాధి, రాజకీయ, ఆర్థిక విషయాలతోపాటు పలు అంశాలపై 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని కమిషన్ అధ్యయనం చేసింది. మొత్తం ఎస్సీల్లో ఏ కులం వారు ఎంతమంది ఉన్నారు? ఉప కులాల జనాభా ఎంత!? తదితర అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేసింది.
ఎవరెవరిని ఏయే గ్రూపుల్లో ఉంచాలనే అంశాన్ని పరిశీలించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో సుమారు 52.50 లక్షల మంది ఎస్సీలుండగా.. వీరిలో మాదిగలు 33.50 లక్షలు, మాలలు 19 లక్షల మంది ఉన్నారు. వీరిలో అక్షరాస్యత శాతం ఎంత!? విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఎంతమంది? ఉపకార వేతనాలను ఎంతమంది అందుకున్నారు? ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని ఎంతమంది పొందారనే వివరాలను కూడా సేకరించి, పరిశీలించింది.
అలాగే, ఎస్సీల్లో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారనే వివరాలను కూడా సేకరించింది. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో కలిపి దాదాపు 94 వేల మందికి పైచిలుకు ఉన్నట్టు ఆయా శాఖలు కమిషన్‌కు ఇచ్చిన రిపోర్టుల్లో తేలింది. ఇక ఎస్సీలకు రాజకీయ అవకాశాలపైనా వివరాలు సేకరించింది. గ్రామ, మునిసిపాలిటీల్లో వార్డు సభ్యుని నుంచి ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ సహా ఇప్పటి వరకూ వారు రాజకీయ ప్రాతినిధ్యం వహించిన వివరాలను తీసుకుంది.
ఈ అంశాలన్నిటినీ అధ్యయనం చేసి మాదిగ, మాల సహా ఉప కులాలకు కేటాయించాల్సిన రిజర్వేషన్లపై పలు సూచనలు చేస్తూ ప్రభుత్వానికి నివేదికను అందజేసింది.
More Stories
ఏపీలో ఆలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి
కొత్త సీఈసీగా జ్ఞానేశ్‌కుమార్
తెలంగాణాలో ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో!