ట్రంప్ టారిఫ్ హెచ్చరికలతో భారత్ కు ఆందోళన లేదు

ట్రంప్ టారిఫ్ హెచ్చరికలతో భారత్ కు ఆందోళన లేదు
టారిఫ్ హెచ్చరికలతో పొరుగు దేశాలపై కయ్యానికి కాలు దువ్విన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు సుంకాల విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. గతంలో పలుమార్లు భారత్ ను `టారిఫ్ కింగ్’ అంటూ ట్రంప్ విమర్శించారు. ఈ క్రమంలోనే భారత్ పై సుంకాల కొరడాను ఝులిపిస్తారా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 

ఈ నేపథ్యంలో భారత్ ఆందోళన చెందుతుందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందడం లేదని స్పష్టం చేశారు. భారత్ తయారీ కేంద్రంగా ఉండాలని తాము కోరుకుంటున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. సేవల రంగంలో బలంగా ఉన్నామని పేర్కొన్నారు. 

సాఫ్ట్ వేర్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, స్టెమ్ ఆధారిత పరిశోధనల పరంగా భారత్ స్వదేశీ సామర్థ్యాన్ని కలిగి ఉందని చెబుతూ భారత్ బలాలేంటో మనకు తెలుసని తెలిపారు. భారత్ లో అందుబాటులో లేని ఉత్పత్తులను మనం దిగుమతి చేసుకోవాలని చెబుతూ వాటిపై అధిక టారిఫ్ విధించి ఇండియాలోకి రాకుండా ఆపడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని పరోక్షంగా ఆర్ధిక మంత్రి ట్రంప్ కు హితవు చెప్పారు. 

భారత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు. అత్యంత అప్రమత్తతతో పరిస్థితులను గమనిస్తున్నాం అని ఆమె చెప్పారు. ఇతర దేశాలపై ముఖ్యంగా ప్రపంచ వాణిజ్య డైనమిక్స్‌లో విధించిన సుంకాల నుంచి పరోక్ష ప్రభావాలు ఉండవచ్చు, భారత్ అప్రమత్తంగా ఉండి తదనుగుణంగా మారుతుందని ఆర్థిక మంత్రి చెప్పారు.

“ఆత్మనిర్భరత”పై భారత్ దృష్టి పెట్టడం వల్ల అమెరికా సుంకాల నుండి ఊహించని సవాళ్ల ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని సీతారామన్ తెలిపారు. ఎగుమతి క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్, ఎగ్జిమ్ బ్యాంక్ వంటి వాణిజ్య సంస్థలను బలోపేతం చేయడం ద్వారా ఎగుమతి రంగానికి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం కొనసాగిస్తున్న ప్రయత్నాల గురించి ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ వెల్లడించారు.