
ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌పై కేరళ కోర్టు నాన్‌బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేసింది. బాబా రామ్‌దేవ్ సహచరుడు, పతంజలి ఆయుర్వేద సంస్థ ఎండి ఆచార్య బాలకష్ణపైనా కోర్టు వారంట్ జారీ చేసింది. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, అవాస్తవాలను ప్రచారం చేశారని ఆరోపణలు వచ్చాయి.
పతంజలి కంపెనీకి చెందిన దివ్య ఫార్మసీ వైద్య విధానాల మీద తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేశారనే ఆరోపణల మీద కేరళలో కేసు నమోదైంది. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలతో పాటు తప్పుడు ప్రచారాలు చేశారనే అభియోగాల నేపథ్యంలో అక్కడి డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ కేసు నమోదు చేశారు. ఈ కేసుపై పాలక్కడ్ జిల్లా కోర్టు విచారణ చేపట్టింది.
ఈ కేసు విచారణలో భాగంగా పాలక్కాడ్ కోర్టు బాబా రామ్‌దేవ్‌కు, ఆచార్య బాలకృష్ణకు గతంలో నోటీసులు పంపించింది. ఈ నెల 1న విచారణకు స్వయంగా హాజరు కావాలని వారిని కోర్టు ఆదేశించింది. అయితే, శనివారం (1న) జరిగిన విచారణకు వారిద్దరూ హాజరు కాలేదు. దీనితో వారిపై కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ చేసింది.
ఈ కేసును ఈ నెల 15న విచారిస్తామని చెబుతూ కోర్టు వాయిదా వేసింది. కాగా, పతంజలి అనుబంధ సంస్థ దివ్య ఫార్మసీకి చెందిన పది ఉత్పత్తులపై ప్రభుత్వం గతంలోనే వేటు వేసింది. ఆ ఉత్పత్తులకు సంబంధించి ప్రసార మాధ్యమాల్లో విడుదల చేసిన ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొంటూ వాటి తయారీ లైసెన్స్‌ను ప్రభుత్వం రద్దు చేసింది.
More Stories
జాతీయ పార్టీల ఆదాయాలలో 74 శాతం బీజేపీకే
న్యూ ఇండియా బ్యాంకులో రూ. 122 కోట్ల కుంభకోణం
జౌళి ఎగుమతుల్ని రూ.9 లక్షల కోట్లకు పెంచాలి