మూడేళ్లల్లో 200 వందేభారత్​ రైళ్లు, 17,500 జనరల్‌ కోచ్​లు తయారీ

మూడేళ్లల్లో 200 వందేభారత్​ రైళ్లు, 17,500 జనరల్‌ కోచ్​లు తయారీ

రానున్న రెండు మూడేళ్లలో దేశంలో 200 కొత్త వందేభారత్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు. వాటితో పాటు ఈసారి ప్రధానంగా 17,500 జనరల్‌ బోగీలు, 100 అమృత్‌భారత్‌ రైళ్లు, 50 నమోభారత్‌ రైళ్ల ఉత్పత్తికి కేంద్రం పచ్చజెండా ఊపినట్లు పేర్కొన్నారు. 

కొత్తగా తీసుకురానున్న అమృత్​ భారత్ రైళ్లతో తక్కువ దూరం ఉన్న నగరాలకు కనెక్టివిటీ మరింత పెరుగుతుందని ఆయన చెప్పారు. రానున్న నాలుగైదేళ్లలో రూ.4.6 లక్షల కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులు అమలుచేస్తామని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. వీటిలో కొత్త లైన్లు వేయడం, డబ్లింగ్, నాలుగు లైన్లు చేయడం, కొత్త నిర్మాణాలు, స్టేషన్ల అభివృద్ధి, పైవంతెనలు, అండర్‌పాస్‌లు ఇలా చాలా ఉన్నాయి. 

“మార్చి నెలాఖరులోపు 1,400 జనరల్‌ బోగీలు తయారవుతాయి. వెయ్యి పైవంతెనల నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. సరకు రవాణా సామర్థ్యం గణనీయంగా పెరిగింది మార్చి 31 నాటికి 1600 కోట్ల టన్నుల సామర్థ్యాన్ని చేరుకుని, ప్రపంచంలో చైనా తర్వాత రెండోస్థానంలో ఉంటాం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేసరికల్లా నూరుశాతం విద్యుదీకరణ సాధిస్తాం” అని తెలిపారు.

రైల్వేల భద్రతకు వెచ్చించే మొత్తాన్ని రూ.1.08 లక్షల కోట్ల నుంచి రూ. 1.16 లక్షల కోట్లకు పెంచాం. పీపీపీ పెట్టుబడులను కూడా కలిపితే రైల్వేలకు మొత్తం కేటాయింపు రూ.2.64 లక్షల కోట్లు అవుతుందని వివరించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రైల్వే శాఖకు ఈసారి బడ్జెట్‌లో రూ.2.65 లక్షల కోట్లు కేటాయించారు. 

ఇందులో రూ.2.52 లక్షల కోట్ల సాధారణ ఆదాయాలు, రూ.200 కోట్ల నిర్భయ ఫండ్, అంతర్గత వనరుల నుంచి రూ.3వేల కోట్లు, బడ్జెటేతర వనరుల నుంచి రూ.10వేల కోట్లు ఉంటాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికులు, సరకు రవాణా తదితర మార్గాల్లో రూ.3.02 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.

2024-25 సవరించిన అంచనాల్లో రైల్వే భద్రతకు రూ.1,14,062 కోట్లు కేటాయించగా, 2025-26 బడ్జెట్‌ అంచనాల్లో రూ.1,16,514 కోట్లు ఇచ్చారు. ఏడాదికి 4వేల కిలోమీటర్ల కొత్త లైన్లు వేస్తున్నారు. గడిచిన పదేళ్లలో 31,180 కి.మీ. కొత్త ట్రాక్‌లు వేశారు. 

అయితే సిగ్నలింగ్, టెలికంకు ఇచ్చిన కేటాయింపు రూ.6,800 కోట్లేనని, కానీ వచ్చే ఐదేళ్లలో 44వేల రూట్‌ కిలోమీటర్లకు ‘కవచ్‌’ వ్యవస్థ ఏర్పాటు చేయాలనుకుంటున్నందున ఈ మొత్తం సరిపోదని ఇండియన్‌ రైల్వేస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సిగ్నల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్స్‌ మాజీ డీజీ శైలేంద్రకుమార్‌ గోయల్‌ వ్యాఖ్యానించారు.