ట్రంప్ విధానాలతో పడిపోతున్న రూపాయి విలువ

ట్రంప్ విధానాలతో పడిపోతున్న రూపాయి విలువ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధానాలతో డాలర్‌తో రూపాయి మారకం విలువ రోజు రోజుకు అదోపాతాళానికి పడిపోతుంది. సోమవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏకంగా 55 పైసలు క్షీణించి 87.17కు దిగజారి.. ఆల్‌టైం కనిష్ట స్థాయిని చవి చూసింది. కెనడా, మెక్సికోలపై 25 శాతం, చైనాపై 10 శాతం చొప్పున ట్రంప్‌ టారీఫ్‌ల పెంపు ప్రకటనతో భారత కరెన్సీ తీవ్ర ప్రభావితమయ్యింది.

ఇంటర్‌బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్సేంజీలో డాలర్‌తో రూపాయి విలువ 87 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో ఏకంగా 87.29కి పడిపోయింది. తుదకు 55 పైసలు కోల్పోయి 87.17 వద్ద ముగిసింది. ఇది భారత రూపాయి చరిత్రలోనే అత్యంత పేలవమైన ప్రదర్శన. అయితే భయపడాల్సిందేమీ లేదని ఆర్ధిక శాఖ కార్యదర్శి తూహిన్‌ కాంత పాండే పేర్కొనడం గమనార్హం.

కరెన్సీ విలువ క్షీణతపై ఆర్‌బిఐ చూసుకుంటుందని చెబుతూ రూపాయి విలువ అనేది ఎవరూ నియంత్రించేది కాదని తెలిపారు. దానికంటూ ఒక స్థిరమైన ధర అంటూ ఉండదని పేర్కొంటూ విదేశీ మదుపర్ల నిధులు తరలిపోవడం ద్వారా రూపాయి విలువ పడిపోవడానికి ఓ కారణమని చెప్పారు. శుక్రవారం సెషన్‌లో 86.62 వద్ద ముగిసింది. భారత స్టాక్‌ మార్కెట్ల నుంచి భారీగా విదేశీ సంస్థాగత పెట్టుబడులు (ఎఫ్‌ఐఐ)లు తరలిపోవడానికి తోడు అమెరికా టారీప్‌ల భయాలు, డాలర్‌కు విలువ పెరగడం తదితర పరిణామాలు రూపాయి విలువను ఒత్తిడికి గురి చేశాయని నిపుణులు పేర్కొంటున్నారు. 

మరోవైపు ముడి చమురు బ్యారెల్‌ ధర 1.41 శాతం పెరిగి 76.74 వద్ద ముగిసింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే డాలరుతో రూపాయి విలువ 90కి చేరినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని నిపుణులు పేర్కొంటున్నారు. రూపాయి ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని, వచ్చే 6-8 వారాల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని ఆర్‌బిఎల్‌ బ్యాంక్‌ ట్రెజరీ హెడ్‌ అన్షుల్‌ చెందక్‌ పేర్కొన్నారు.

చైనా, మెక్సికో, కెనడా దేశాలపై ట్రంప్‌ సుంకాల పెంపు పరిణామాల నేపథ్యంలో తుహిన్‌ కాంత పాండే స్పందించారు. భారత ప్రభుత్వం దిగుమతులపై సుంకాలు పెంచి ఎల్లప్పుడూ ఇండియన్‌ కంపెనీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భావించొద్దని స్పష్టం చేశారు. బడ్జెట్‌లో చాలా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించామని గుర్తు చేశారు.