
తెలంగాణాలో బీసీల జనాభా 46.25 శాతమని, 10.08 శాతం ఉన్న ముస్లిం బీసీలను కలుపుకొంటే మొత్తం 56.33 శాతమని రాష్ట్ర ప్రణాళిక శాఖ సర్వే లెక్కతేల్చినట్టు క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్, సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర జనాభా మొత్తంగా 3.70 కోట్ల మంది కాగా, వారిలో 16 లక్షల మంది (3.1శాతం) సర్వేలో పాల్గొనలేదని, మిగతా 3.54 కోట్ల మంది వివరాలను సేకరించినట్టు తెలిపారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో గత నవంబర్‌లో ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల) నిర్వహించిన విషయం తెలిసిందే. సర్వేకు సంబంధించిన నివేదికను ప్లానింగ్‌శాఖ పుస్తకం రూపంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని మం త్రివర్గ ఉపసంఘానికి ఆదివారం అందజేసింది.
ఈ సందర్భంగా సర్వే నివేదికపై సబ్‌కమిటీ కో చైర్మన్ దామోదర రాజనర్సింహ, సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి సీతక్క సచివాలయంలో ఆదివారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్లానింగ్‌శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్ర నోడల్ అధికారి అనుదీప్ దురిశెట్టి, అధికారుల బృందంతో మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సర్వే నివేదిక వివరాలను వెల్లడించారు. 50 రోజుల్లోనే కులగణన పూర్తి చేయడం చరిత్రాత్మకమని చెప్పారు. రాష్ట్రంలో మొత్తంగా 3.70 కోట్ల మంది జనాభా ఉండగా, వారిలో 3,54,77,554 (96.9 శాతం) మందిని సర్వే చేసి వివరాలు సేకరించామని తెలిపారు. 3.1 శాతం కుటుంబాలు తమ వివరాలను వెల్లడించలేదని తెలిపారు.
1.03 లక్షల ఇండ్లు తలుపులు వేసి ఉండడం, 1.68 లక్షల కుటుంబాలు మొదట్లో పాల్గొనడానికి సంకోచించడం, 84,137 ఇండ్లు నివాసేతరంగా ఉండడం వంటి సమస్యలతో మొత్తంగా 16 లక్షల కుటుంబాల వివరాలను సేకరించలేదని వివరించారు.
డాటా ద్వారా సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు వినియోగిస్తామని తెలిపారు. సర్వే నివేదికపై 4న మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదం తీసుకుంటామని, అదే రోజు అసెంబ్లీలో చర్చకు పెడతామని వెల్లడించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఈ సర్వే తెలంగాణ చరిత్రలో ఓ స్వర్ణాధ్యాయమని పేర్కొన్నారు.
మంత్రి దామోదర రాజ నరసింహ మాట్లాడుతూ సామాజిక న్యాయాన్ని నిర్ధారించడంలో నిబద్ధతతో కూడిన ప్రయత్నమే ఈ సర్వే అని వ్యాఖ్యానించారు. సీతక మాట్లాడుతూ ఇలాంటి సర్వేలు దేశవ్యాప్తంగా నిర్వహించాల్సిన అవసరముందని చెప్పారు.
సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం 4న ఉదయం 10 గంటలకు కొనసాగనుంది. అదేరోజున ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సారథ్యంలోని క్యాబినెట్ సబ్ కమిటీకి ప్రణాళికా విభాగం సమర్పించిన సమగ్ర ఇంటింటి కులగణన సర్వే నివేదికపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు.
నేడు ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏకసభ్య న్యాయకమిషన్ తమ నివేదికను క్యాబినెట్ సబ్ కమిటీకి అందించనున్నది. అసెంబ్లీ తీర్మానమైన తర్వాత.. బలహీన వర్గాల స్థితిగతుల మెరుగు కోసం చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
More Stories
ఏపీలో ఆలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి
కొత్త సీఈసీగా జ్ఞానేశ్‌కుమార్
తెలంగాణాలో ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో!