
టీమ్ ఇండియా అండర్ 19 అమ్మాయిలు విశ్వ విజేతలుగా నిలిచారు. 2025 అండర్- 19 T20 వరల్డ్‌కప్ టైటిల్ నెగ్గారు. ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. సఫారీ జట్టు నిర్దేశించిన 83 పరుగుల లక్ష్యాన్ని, టీమిండియా అమ్మాయిలు 11.2 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి ఛేదించారు.
గొంగడి త్రిష (44 పరుగులు; 33 బంతుల్లో: 8×4) స్వల్ప ఛేదనలో అదరగొట్టింది. నాటౌట్‌గా నిలిచింది. సనికె చక్లె (26 పరుగులు) రాణించింది. సౌతాఫ్రికా బౌలర్లలో రెనెకె 1 వికెట్ దక్కించుకుంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 82 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్ల విజృంభనతో సఫారీ జట్టు విలవిల్లాడింది.
కౌలాలంపూర్‌లోని బయుమాస్ ఓవల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే పేలవమైన ఆరంభం తర్వాత జట్టు స్కోరు 82 పరుగులకే పరిమితమైంది. 18 బంతుల్లో 23 పరుగులు చేసిన మైకే వాన్ వూర్స్ట్ దక్షిణాఫ్రికా తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచారు. నలుగురు ప్లేయర్లు పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు.
భారత్ చాంపియన్‌గా నిలవడంలో త్రిష కీలక పాత్ర పోషించింది. బౌలింగ్‌లో మూడు వికెట్లు తీయడంతోపాటు.. బ్యాటింగ్‌లో 44 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిష ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగానూ తెలుగుమ్మాయే నిలిచింది. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ త్రిష అజేయ శతకం బాదడంతోపాటు 6 పరుగులకే 3 వికెట్లు తీసి సత్తా చాటిన సంగతి తెలిసిందే. తెలుగు క్రికెటర్ గొంగడి త్రిష టోర్నీ ఆసాంతం బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటింది.
More Stories
ఏపీలో ఆలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి
కొత్త సీఈసీగా జ్ఞానేశ్‌కుమార్
తెలంగాణాలో ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో!