కెనడా, మెక్సికో, చైనాలపై ట్రంప్ టారిఫ్ వార్‌

కెనడా, మెక్సికో, చైనాలపై ట్రంప్ టారిఫ్ వార్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఒకే సారి మూడు దేశాలపై సుంకాలు విధించి ఝలక్‌ ఇచ్చారు. కెనడా, మెక్సికో చైనా దేశాలపై టారిఫ్‌లు విధించారు. కెనడా, మెక్సికో నుంచి దిగుమతులపై 25 శాతం, చైనా నుంచి వచ్చే వస్తువులపై 10 శాతం సుంకం విధిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. దేశంలో తయారీని పెంచడానికి, ఫెడరల్‌ ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచేందుకు ఈ సుంకాలను ఉపయోగిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు.

మెక్సికో, కెనడా దిగుమతులపై 25 శాతం (కెనడియన్‌ ఎనర్జీపై 10 శాతం), చైనాపై 10 శాతం అదనపు సుంకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఫెంటానిల్‌ సహా మన దేశంలోకి వస్తున్న అక్రమ విదేశీయులు, ప్రాణాంతక మాదకద్రవ్యాలను అరికట్టేందుకు అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం ద్వారా ఈ సుంకాలు విధించానని తెలిపారు. 

అమెరికన్లను రక్షించాల్సిన అవసరం ఉన్నదని, అందరి భద్రతను నిర్ధారించడం అధ్యక్షుడిగా తన కర్తవ్యమని వెల్లడించారు. సరిహద్దు వెంబడి సంక్షోభం తగ్గే వరకు సుంకాలు అమలు చేస్తామని తెలిపారు. కాగా, ఈ సుంకాలను మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. 

ఈ నేపథ్యంలో రవాణాలో ఉన్న వస్తువులు, కటాఫ్‌ సమయానికి ముందే అమెరికా సరిహద్దుల్లోకి వచ్చే వారికి సుంకాల నుంచి మినహాయింపు ఉందనుంది. ట్రంప్‌ నిర్ణయంతో అమెరికా వృద్ధి తగ్గడమే కాకుండా, కెనడా, మెక్సికో దేశాల్లో ఆర్థిక మాంద్యం ఏర్పడే ముప్పు పొంచిఉన్నది. అదేవిధంగా ఉత్తర అమెరికాపై ప్రభావం చూపనుంది.

ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం అమెరికా అక్టోబర్​లో కెనడా నుంచి రోజూ దాదాపు 4.6 మిలియన్ బ్యారెళ్ల చమురును, మెక్సికో నుంచి 5,63,000 బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంది. అదే నెలలో యూఎస్ రోజువారీ ఉత్పత్తి సగటున రోజుకు 13.5 మిలియన్ బ్యారెల్స్. తమ దేశ వస్తువులపై ట్రంప్ సర్కార్ సుంకాలు విధించడంపై కెనడా, మెక్సికో స్పందించాయి. అవసరం అయితే తాము అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలు విధిస్తామని హెచ్చరించాయి.

“మా దేశ వస్తువులపై అమెరికా సుంకాలు విధిస్తే కెనడా ప్రతిస్పందనకు సిద్ధంగా ఉంది. సుంకాల విధించడంపై ట్రంప్ ముందుకెళ్తే మేము అదే విధంగా ముందుకు సాగుతాం. సుంకాలు అమెరికాకు వినాశకరమైన పరిణామాలను కలిగిస్తాయి. ఇవి అమెరికన్ల ఉద్యోగాలను ప్రమాదంలో పడేస్తాయి. అలాగే ధరలు పెరుగుదలకు కారణం అవుతాయి. యూఎస్​లోకి ఫెంటానిల్, అక్రమ వలసదారులు ఒక శాతం కంటే తక్కువే కెనడా నుంచి వచ్చారు. ” అని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించారు.

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికార బాధ్యతలు చేపట్టేముందు యూఎస్​తో మెక్సికో బృందం చర్చలు జరిపిందని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్ బామ్ తెలిపారు. అయితే మెక్సికోపై యునైటెడ్ స్టేట్స్ విధించే సుంకాల విషయంలో తమ వద్ద ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఉందని ఆమె స్పష్టం చేశారు. తాము ఎల్లప్పుడూ దేశ ప్రజల గౌరవాన్ని, సార్వభౌమాధికారాన్ని కాపాడతామని స్పష్టం చేశారు.

కెనడా, మెక్సికోపై 25 శాతం, చైనా వస్తువులపై 10 శాతం సుంకాలు విధించడం వల్ల యూఎస్‌ సహా అన్ని ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటాయని వార్విక్ మెక్‌ కిబ్బిన్ అండ్ మార్కస్ నోలాండ్ అనే అధ్యయనం తేల్చింది. మెక్సికోపై విధించే 25శాతం టారిఫ్ వల్ల ఆ దేశంలో ఆర్థిక క్షీణత ఏర్పడుతుందని పేర్కొంది. ఇది మెక్సికన్ వలసదారులు అక్రమంగా యూఎస్ లోకి ప్రవేశించడానికి కారణమవుతుందని తెలిపింది.