ఎమ్యెల్యేల తిరుగుబాటుపై రేవంత్ రెడ్డి కలవరం!

ఎమ్యెల్యేల తిరుగుబాటుపై రేవంత్ రెడ్డి కలవరం!
సుమారు 10 మంది అధికార పార్టీ ఎమ్యెల్యేలు రహస్యంగా భేటీ జరిపారని వచ్చిన కధనాల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శిబిరంలో కలవరం చెలరేగింది.
ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అత్యవసర క్యాబినెట్‌ భేటీ నిర్వహించారు. జిల్లాల పర్యటనలతో బిజీగా ఉన్న మంత్రులు, తమ అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకొని హుటాహుటిన హైదరాబాద్‌ చేరుకున్నారు. 
 
సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. కేంద్ర బడ్జెట్‌పై చర్చ ఎజెండాగా కార్యక్రమాన్ని రూపొందించినట్టు సీఎం కార్యాలయం ప్రకటించినప్పటికీ, ఎమ్మెల్యేల తిరుగుబాటుకు దారితీసిన కారణాల మీదనే సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.

జిల్లాల్లో ఇన్‌చార్జ్జి మంత్రులకు, స్థానిక ఎమ్మెల్యేలకు మధ్య రోజురోజుకు అంతరం పెరిగిపోతున్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసహనం వ్యక్తంచేసినట్టు తెలిసింది. త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయని, అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్‌ చేస్తున్నదని చెప్పినట్టు సమాచారం. 
 
ఈ ఎన్నికలు మన పాలనకు రెఫరెండంగా ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్న సమయంలో కలిసి పనిచేయాల్సిందిపోయి తిరుగుబాటు చేయడం మంచిది కాదని, ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ దేనికి సంకేతమనే ఆందోళన వ్యక్తంచేసినట్టు సమాచారం. అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించి వారిని కలుపుకొని పోవాలని ఈ సందర్భంగా మంత్రులకు సూచించినట్టు తెలిసింది.
 
పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయంతో నడిపే బాధ్యత మంత్రులు తీసుకోవాలని, ఎమ్మెల్యేలకు అవసరమైన వనరుల కల్పన కూడా మంత్రులే చూసుకోవాలని సీఎం స్పష్టం చేసిన్నట్లు చెబుతున్నారు. శుక్రవారం రాత్రి జరిగిన విందులో పాల్గొన్నవారి వివరాలు తన వద్ద ఉన్నాయని, ప్రజల్లోకి వెళ్లలేని ఎమ్మెల్యేలు కొంతమంది గుంపుకట్టి రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రస్వరంతో అన్నట్టు సమాచారం. 
 
ఈ నేపథ్యంలో మంత్రులు కొన్ని సమస్యలను సీఎం దృష్టికి తీసుకు వచ్చినట్లు తెలిసింది. జనవరిలో గ్రామసభలు నిర్వహించినప్పటి నుంచే పార్టీలో ఎమ్మెల్యేలు నిరసన గళం వినిపిస్తున్నారని, సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో జిల్లా ఇన్‌చార్జి మంత్రులకు విచక్షణాధికారాలు ఇవ్వడం పట్ల ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారని కొందరు మంత్రులు సీఎంకు వివరించినట్టు తెలిసింది. మంత్రులతో సమానంగా నియోజకవర్గాలకు నిధులు అడుగుతున్నారని మరికొందరు మంత్రులు సీఎం దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం. 
 
అధికారంలోకి వచ్చి ఏడాదైనా, ఇప్పటివరకు నియోజకవర్గ ప్రత్యేక అభివృద్ధి నిధి (సీఎస్‌డీఎఫ్‌) ఇవ్వకపోవడం పట్ల ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని మంత్రులు ప్రస్తావించినట్టు తెలిసింది. అయితే భేటీ వాస్తవం అయినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నియోజకవర్గాల అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రిని ఒక బృందంగా వెళ్లి అడిగేందుకే వారు సమావేశం అయినట్టు ఇప్పుడు సర్దిచెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. 
 
మరికొందరు ఎమ్మెల్యేలు మాత్రం ఆ సమావేశానికి తాము వెళ్లకపోయినా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని తీవ్రంగా ఖండించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరూధ్‌రెడ్డి పార్టీకి చెందిన కొందరు సహచర ఎమ్మెల్యేలకు శుక్రవారం ఫోన్ చేసి ఈ విందు భేటీకి ఆహ్వానించినట్లు పార్టీ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. 
 
అయితే, స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నియోజకవర్గాల అభివృద్ధి పనులకు అధిక నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రిని అడిగేందుకు విడివిడిగా కాకుండా ఒక బృందంగా వెళ్లి అడిగితే బాగుంటుందని, ఆ విషయమై కలుద్దామని పిలిచారని చెబుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ జరిగింది వాస్తవమే అయినప్పటికీ అది విందు సందర్భంగా అని నాగర్‌కర్నూల్ ఎంపి డాక్టర్ మల్లు రవి స్పష్టం చేశారు. 
 
విందులో కలిసింని 10 మంది ఎమ్మెల్యేలు కాదని 8 మంది మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కోహినూర్ హోటల్‌లో ఆ విందు జరిగిందని కూడా మల్లు వెల్లడించారు. తమ ఎమ్మెల్యేలు కలిసి భోజనం చేస్తే తప్పేంటీ అని ఆయన ప్రశ్నించారు. మరోవంక, శుక్రవారం రాత్రి సమావేశమైన నల్లగొండ, పాలమూరుకు చెందిన పది తిరుగుబాటు ఎమ్మెల్యేలతో మరింతమంది జతకడుతున్నట్టు తెలుస్తున్నది. 
 
రాష్ట్ర ప్రభుత్వంలో నంబర్‌-2గా చెప్పుకుంటున్న మంత్రిని టార్గెట్‌గా చేసుకొని తిరుగుబాటు మొదలైనట్టు సమాచారం. పార్టీని కాపాడుకోవడానికి నోరు విప్పాల్సిందేనని, రూ.కోట్లకు కోట్ల డబ్బు మూటలతో వచ్చి రాజకీయాన్ని వ్యాపారంగా మార్చాలనుకునే వారిని పార్టీ నుంచి బయటికి పంపే వరకు వెనక్కి తగ్గవద్దని, త్వరలోనే రాహుల్‌గాంధీని కలిసి ఫిర్యాదుచేయాలని తిరుగుబాటు ఎమ్మెల్యేలు నిర్ణయించినట్లు చెబుతున్నారు.