
ఆదాయ పన్ను మినహాయింపు 12 లక్షలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం మధ్యతరగతి ఉద్యోగులకు భారీ ఊరటగా నిలిచిందని పేర్కొంటూ ఒకేసారి 5 లక్షల పన్ను మినహాయింపు చేస్తూ 7 లక్షల నుంచి 12 లక్షలకు పెంచడం సాహసోపేతమైన నిర్ణయమని జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల కాలంలో రాష్ట్రంలో రూ.3 లక్షల కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందించిన ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రకటించిన 2025-2026 వార్షిక బడ్జెట్‌లో మరిన్ని కేటాయింపులు చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
వికసిత్ భారత్ వైపు నడిపించేలా కేంద్రం బడ్జెట్ ఉందని చెబుతూ ఏపీకి అమూల్యమైన ప్రోత్సాహం ఇస్తున్న ప్రధాన మోదీకి ధన్యవాదాలు తెలిపారు. రాజకీయ అవసరాల కంటే దేశం, ప్రజలు ముఖ్యం అనే కేంద్ర ప్రభుత్వ సమున్నత, దృక్పథం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కనిపించిందని కొనియాడారు. రైతులు, మహిళలు, మధ్యతరగతి ప్రజలు ఇలా ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకున్నారని గుర్తుచేశారు.
5 కోట్ల ప్రజల ఆశలకు ప్రతిరూపంగా నిర్మాణం జరుగుతున్న ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15,000 కోట్లను కేటాయిస్తూ, భవిష్యత్తులో మరింత సహకారం అందిస్తామని చెప్పడం రాజధాని నిర్మాణం సజావుగా, వేగవంతంగా సాగేందుకు ఉపయోగపడనుందని పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు వ్యయ సవరణకు ఆమోదం తెలుపడమే కాకుండా రూ.5,936 కోట్లను కేటాయించడం, నీటి నిల్వ సామర్థ్యాన్ని 41.15 మీటర్లు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వడం, బ్యాలెన్స్ గ్రాంట్ రూ. 12,157 కోట్లుగా ప్రకటించడం, పోలవరం అథారిటీకి అదనంగా మరో రూ.54 కోట్లు కేటాయించి, పోలవరం నిర్మాణం వేగవంతం అయ్యేందుకు సహకరించారని పవన్ కళ్యాణ్ వివరించారు.
జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని 2028 వరకు పొడిగించడం ద్వారా ప్రతీ ఇంటికి మంచినీటి కనెక్షన్ అందించాలనే ఆశయాన్ని సాధించేందుకు తోడ్పడనుందని చెప్పారు. కేంద్ర బడ్జెట్ లో రక్షణ శాఖ తర్వాత అత్యధికంగా రూ. 2.66 లక్షల కోట్ల నిధులను గ్రామీణాభివృద్ధికి కేటాయించడం ద్వారా, రాష్ట్రంలోని ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు అధిక నిధులు సాధించే ఆస్కారం లభించిందని పవన్ కళ్యాణ్ తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ. 3295 కోట్లను కేటాయించడం ద్వారా స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి రుజువైందని చెప్పారు. అలాగే విశాఖ పోర్ట్ అభివృద్ధికి రూ. 730 కోట్లు కేటాయింపు ద్వారా పోర్ట్ సామర్థ్యం పెంపు, వాణిజ్యాభివృద్ధికి దోహదపడనున్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు.
కేంద్ర బడ్జెట్ కేటాయింపులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటూ, రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా కృషి చేయనుందని పవన్ కళ్యాణ్ హర్షం ప్రకటించారు.
10 లక్షల విలువైన క్రెడిట్ కార్డులు మంజూరు చేయడం వల్ల సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకు ఊతం దొరుకుతుందని పవన్ అభిప్రాయపడ్డారు. 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ మహిళ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు 2 కోట్ల రుణాలు ఇవ్వడం ద్వారా ఆ వర్గాల్లోని మహిళల ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందని చెప్పారు.
More Stories
ఏపీలో ఆలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి
కొత్త సీఈసీగా జ్ఞానేశ్కుమార్
తెలంగాణాలో ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో!