వితంతువులను ప్రత్యేక కుటుంబంగా పరిగణించాల్సిందే

వితంతువులను ప్రత్యేక కుటుంబంగా పరిగణించాల్సిందే

* మల్లన్న సాగర్‌ పరిహారంపై హైకోర్టు తీర్పు

కొమురవెల్లి మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు నిమిత్తం భూసేకరణతో ఇళ్లు కోల్పోయిన వితంతువులను ప్రత్యేక కుటుంబంగా పరిగణించి పునరావాస, పునర్నిర్మాణ పథకం కింద పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ భూసేకరణ సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్‌లో చేపట్టారు. గతంలో ఇదే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం, వితంతువులను ప్రత్యేక కుటుంబంగా పరిగణించాల్సిందేనని తెలిపింది. 

దీనిపై బాధితులు సమర్పించిన వినతి పత్రాన్ని పరిశీలించి, నాలుగు నెలల్లో పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2016-19 మధ్య మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు కోసం వేములఘాట్‌ గ్రామం చుట్టూ దాదాపు 2,500 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. దీంతో ఈ గ్రామం మొత్తం ముంపునకు గురైంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఇళ్ల సేకరణ కోసం 2019లో ప్రాథమిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

ఈ నోటిఫికేషన్‌ ప్రకారం అందరినీ నిర్వాసితులుగా గుర్తించి పరిహారం చెల్లించాల్సి ఉందంది. కానీ అధికారులు తమకు పరిహారం చెల్లించకపోవడాన్ని చీర్ల గంగవ్వ, మరో 35 మంది వితంతువులు హైకోర్టులో సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు. 

దీనిపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్ల వయసు 65 ఏళ్లు దాటిందని, భర్తలు లేకపోవడంతో పిల్లలు, బంధువుల వద్ద ఉంటూ ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు. కేవలం వీరు పిల్లల వద్ద ఉన్నారనే కారణంగా ఒకే కుటుంబంగా పరిగణించి పరిహారం నిరాకరించారని న్యాయస్థానానికి తెలిపారు.

గతంలో ఇదే గ్రామంలోని పలువురు భూసేకరణ ప్రక్రియ చట్టప్రకారం జరగలేదంటూ హైకోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వితంతువులను ప్రత్యేక కుటుంబంగా పరిగణించి భూసేకరణ చట్టం లేదా జీవో 120, మరేదైనా పథకం కింద పరిహారం చెల్లించాలంటూ అప్పట్లో న్యాయస్థానం ఆదేశించిందని తెలిపారు. ఈ మేరకు పిటిషనర్లు పరిహారం కోసం గత ఏడాది డిసెంబులో వినతిపత్రం ఇచ్చినా పట్టించుకోలేదని వివరించారు.

అడ్వొకేట్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తూ, గత ఉత్తర్వుల నేపథ్యంలో పునరావాస, పునర్నిర్మాణ పథకం కింద పరిహారం చెల్లింపు ప్రక్రియను కలెక్టర్‌ ప్రారంభించారని చెప్పారు. పిటిషనర్ల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్ల విజ్ఞప్తిపై విచారణ చేపట్టి చట్టప్రక్రారం వితంతువులకు పరిహారం చెల్లించాలని ఆదేశించారు. 

పరిహారం చెల్లింపు సమయంలో ప్రాజెక్టు నిర్వాసితుల కింద వితంతువులు ప్రత్యేక కుటుంబమేనని, ఆ మేరకు భూసేకరణ చట్టం నిబంధనలు, జీవో 120, మరేదైనా పథకాన్ని వర్తింపజేయాలంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు.