
వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్రం బడ్జెట్‌లో ఆరు కొత్త పథకాలను ప్రకటించింది. పప్పు ధాన్యాల ఉత్పత్తిలో ‘ఆత్మనిర్భరత’ సాధించడం, దిగుమతులకు స్వస్తి పలకడం లక్ష్యంగా కీలక పథకం ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఆరేళ్ల పాటు అమలయ్యే ‘జాతీయ పప్పుధాన్యాల కార్యక్రమం’లో కంది, మినప, ఎర్రపప్పులపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది.
నాఫెడ్, ఎన్‌సీసీఎ్‌ఫతో కాంట్రాక్టు ఒప్పందం చేసుకున్న రైతులు వచ్చే నాలుగేళ్ల పాటు రైతులు ఎంత పండిస్తే అంతా ఆ సంస్థల ద్వారా కొనుగోలు చేస్తుంది.
మరో పథకం ‘ప్రధాన మంత్రి ధన ధాన్య కృషి యోజన’ను 100 జిల్లాల్లో రాష్ట్రాల భాగస్వామ్యంతో అమలు చేయనుంది. తక్కువ ఉత్పాదికత, పరిమితంగా పంటల సాగు, రుణాల చెల్లింపులో వెనుకబడిన జిల్లాలను ఈ పథకానికి ఎంపిక చేస్తారు.
దీని ద్వారా ఉత్పాదకత పెంచడం, పంటల మార్పిడి విధానం, కోతల తర్వాత అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో కోటీ 70 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్రం పేర్కొంది. వ్యవసాయ పరిశోధనలను ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపిన కేంద్రం అధిక దిగుబడినిచ్చే, చీడపీడలను, ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునే విత్తనాల అభిృవృద్ధికి ప్రత్యేక పథకం అమలు చేస్తామని ప్రకటించింది.
ఇప్పటికే అభివృద్ధి చేసిన వందకు పైగా కొత్త వంగడాలను వాణిజ్యపరంగా విడుదల చేయడం లక్ష్యంగా నిర్దేశించుకుంది. పత్తి దిగుబడి పెంచేందుకు, మరింత నాణ్యమైన రకాలను ప్రోత్సహించేందుకు ఐదేళ్ల పాటు ప్రత్యేక పథకం అమలు చేస్తామని కేంద్రం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా అవకాశాలు కల్పించడం, ఉపాధి కోసం వలసలను నిరోధించడానికి సమగ్ర పథకం ప్రవేశపెడతామని ప్రకటించింది.
ఈ పథకంలో గ్రామీణ మహిళలు, యువత, చిన్న సన్నకారు రైతులు, భూమి లేని కుటుంబాలపై ప్రత్యేకంగా దృష్టి పెడతామని తెలిపింది. తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు సాగు చేసే రైతులకు గిట్టుబాటు ధర దక్కేందుకు రాష్ట్రాలతో కలిసి సమగ్ర పథకాన్ని అమలు చేస్తామని పేర్కొంది. చేపలు, రొయ్యల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు కూడా పథకం ప్రవేశపెడతామని వెల్లడించింది
కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ)పై స్వల్ప కాలిక రుణ పరిమితి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. దీని వల్ల 7.7 కోట్ల మంది రైతులు, పాడి రైతులు, మత్స్యకారులకు లబ్ధి చేకూరుతుందని తెలిపింది. బిహార్‌లో మఖానా (తామరగింజలు) బోర్డు, అసోంలో 12.7 లక్షల టన్నుల సామర్థ్యంలో యూరియా ప్లాంటు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.
More Stories
జాతీయ పార్టీల ఆదాయాలలో 74 శాతం బీజేపీకే
న్యూ ఇండియా బ్యాంకులో రూ. 122 కోట్ల కుంభకోణం
జౌళి ఎగుమతుల్ని రూ.9 లక్షల కోట్లకు పెంచాలి