ప్రపంచంలోనే 4వ సైనికంగా శక్తివంతమైన భారత్

ప్రపంచంలోనే 4వ సైనికంగా శక్తివంతమైన భారత్
2025 ఏడాదికి సంబంధించి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక శక్తి కలిగిన దేశాల జాబితా విడుదల అయింది. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ లో భారతదేశం ఒక ముఖ్యమైన సైనిక శక్తిగా వర్ణించబడింది. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ లో ప్రపంచంలోని టాప్-5 అత్యంత శక్తివంతమైన సైనిక శక్తులలో భారత్ కూడా ఉంది. 
 
సైనిక విభాగాలు, ఆర్థిక పరిస్థితి, లాజిస్టిక్స్ సామర్థ్యాలను సహా 60కి పైగా అంశాల అంచనా ఆధారంగా ర్యాంకింగ్ లు రూపొందించినట్లు  గ్లోబల్ ఫైర్ పవర్ వెబ్ సైట్ పేర్కొంది.  గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ర్యాంకింగ్ ప్రకారం అగ్రరాజ్యమైన అమెరికా సైన్యం 0.0744 స్కోరుతో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక శక్తిగా మొదటి స్థానంలో నిలిచింది. 
 
ఆ తర్వాత రష్యా, చైనాలు ఉన్నాయి. భారత్ ప్రపంచంలోనే నాల్గవ అత్యంత శక్తివంతమైన సైనిక శక్తిగా నిలిచింది. భారత్ స్కోరు 0.1184గా ఉంది. దక్షిణ కొరియా టాప్-5 శక్తివంతమైన సైనిక శక్తులలో చోటు దక్కించుకుని ఐదో స్థానంలో నిలిచింది. భారత దాయాది దేశమైన పాకిస్థాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నప్పటికీ ప్రపంచంలోని టాప్-10 సైనిక శక్తులలో కూడా చోటు దక్కలేదు. 
 
గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ లో పాకిస్థాన్ బ్రెజిల్ కంటే దిగువన 12వ స్థానంలో ఉంది. వైమానిక దళం, నావికాదళం పరంగా కూడా ఇండియా పొరుగు దేశమైన పాకిస్థాన్ కంటే చాలా ముందుంది. పాకిస్తాన్ వైమానిక దళం ర్యాంకింగ్ లో 7వ స్థానంలో ఉండగా, భారత వైమానిక దళం టాప్-5లో చోటు దక్కించుకుని నాల్గవ స్థానంలో నిలిచింది. 
 
భారత్ కు చెందిన నేవీ ప్రపంచంలో 6వ స్థానంలో ఉండగా, పాకిస్తాన్ నావికాదళం 27వ స్థానంలో ఉంది. భారత మొత్తం సైనిక బలం 51.37 లక్షలు, ఇందులో 14.55 లక్షల మంది క్రియాశీల సైనికులు, 11.55 లక్షల మంది రిజర్వ్ సైనికులు ఉన్నారు. భారత ఆర్మీలో 21.97 లక్షల మంది సైనికులు, వైమానిక దళంలో 310575 మంది, నౌకాదళంలో 142251 మంది సైనికులు ఉన్నారు. భారత్ లో 25.27 లక్షల మంది పారామిలిటరీ సిబ్బంది ఉన్నారు.
 
పాకిస్తాన్ మొత్తం సైనిక బలం 17.04 లక్షలు కాగా, 6.54 లక్షల మంది క్రియాశీల సైనికులు, 5.50 లక్షల మంది రిజర్వ్ సైనికులు ఉన్నారు. పాకిస్థాన్ సైన్యంలో 13.11 లక్షల మంది సైనికులు, వైమానిక దళంలో 78,128 మంది, నావికాదళంలో 124800 మంది సైనికులు ఉన్నారు. పాకిస్థాన్ లో 5 లక్షల పారామిలిటరీ దళాలు ఉన్నాయి.
 
గ్లోబల్ మిలిటరీ పవర్ ర్యాంకింగ్ లో బ్రిటన్ ఆరో స్థానంలో, ఫ్రాన్స్ 7వ స్థానంలో, జపాన్ 8 స్థానంలో, టర్కీ 9వ స్థానంలో,ఇటలీ 10వ స్థానంలో నిలిచాయి.