
రూ.12 లక్షలకు మించిన ఆదాయం ఉన్నవారికి శ్లాబులవారీగా పన్నులను నిర్ణయించారు. రూ.20లక్షల నుంచి రూ.24 లక్షల వరకు 25 శాతం పన్నుగా నిర్ణయించారు. రూ.16 లక్షల నుంచి 20లక్షల్లోపు ఆదాయంపై 20 శాతం పన్నుగా నిర్ణయించారు. ఈ నిర్ణయం ద్వారా రూ.18 లక్షల వరకు ఆదాయం వచ్చే వారికి రూ.70 వేల వరకు లబ్ధి చేకూరనుంది. అలాగే రూ.25 లక్షల వరకు ఆదాయం వచ్చే వారికి రూ.1.10 లక్షల వరకు లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగానే టీడీఎస్, టీసీఎస్ రేట్లను కూడా కేంద్రం భారీగా తగ్గించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.
వృద్ధులకు వడ్డీపై వచ్చే ఆదాయంపై రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు పెంచామని తెలిపారు. అద్దె ద్వారా వచ్చే ఆదాయంపై రూ.2.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఆదాయపు పన్ను నుంచి మినహాయిస్తున్నట్లు తెలిపారు. వచ్చే వారంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును పార్లమెంటులో పెట్టబోతున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.
భారతీయ న్యాయ సంహిత్ చట్టం స్ఫూర్తితో ఆదాయపు పన్నుకు చట్టం తీసుకొస్తామని ప్రకటించారు. ఆదాయపు పన్ను విధానంలో సంస్కరణలు తీసుకొస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆదాయపు పన్ను విధానాన్ని మరింత సులభతరం చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుత ఆదాయపు పన్ను నిబంధనల్లో సగానికి తగ్గిస్తామని చెప్పారు. బిల్లులో సులభతర విధానం తీసుకురాబోతున్నామని తెలిపారు.
దేశంలో వైద్యవిద్యను మరింత బలోపేతం చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. రానున్న కాలంలో మెడికల్ కాలేజీల్లో అదనంగా 10 వేల సీట్లను పెంచనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఐదేండ్లలో 75 వేలకు పైగా సీట్ల జోడించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. కొత్తగా ఐఐటీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
ఈ విధంగా గత పదేండ్లలో దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో విద్యార్థుల సంఖ్యం 100 శాతానికిపైగా పెరిగిందని చెప్పారు. కొత్తగా 5 ఐఐటీలను ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా మరో 6500 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ఐఐటీల్లో అదనపు వసతులను సమకూరుస్తున్నామని వెల్లడించారు. విద్యా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) ని వినియోగిస్తామని చెప్పారు.
ఎంఎస్ఎంఈలపై దృష్టి సారిస్తున్నామని వెల్లడించారు. దేశంలో ఒక కోటి కంటే ఎక్కువ ఎంఎస్ఎంఈలు నమోదైఉన్నాయన్నారు. ఉద్యోగ కల్పన బాగా ఉందని, నాణ్యమైన ఉత్పత్తులతో పాటు 45 శాతం ఎగుమతులు ఉన్నాయని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందిస్తున్నామని, మూలధనం పెంచబోతున్నామని తెలిపారు. వచ్చే ఐదేండ్లలో 2.5 రెట్లు అధికంగా కేటాయింపులు చేస్తున్నామన్నారు. సూక్ష్మ పరిశ్రమలకు రాబోయే ఐదేండ్లలో రూ.1.5 లక్షల కోట్ల వరకు రుణాలు ఇస్తామని చెప్పారు.
చెప్పులు, తోలు పరిశ్రమకు మద్ధతు ఇవ్వడానికి కేంద్రీకృత ఉత్పత్తుల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. తద్వారా పాదరక్షలు, తోలు పరిశ్రమలో ఉత్పాదకత, నాణ్యత, పోటీతత్వాన్ని పెంపొంచవచ్చని చెప్పారు. ఇందులో భాగంగా సృజనాత్మకత, అధిక నాణ్యత పాదరక్షలను సృష్టించడానికి డిజైన్ సామర్థ్యాలను పెంచుతామని పేర్కొన్నారు.
అదేవిధంగా కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ ద్వారా నాన్ లెదర్ క్వాలిటీ పాదరక్షలకు అవసరమైన కాంపోనెట్స్ ఉత్పత్తికి మద్దతునిస్తామని తెలిపారు. అదేవిధంగా లెదర్, నాన్ లెదర్ చెప్పుల ఉత్పత్తికి అవసరమైన అధునాతన యంత్రాలకు అనుమతులను సులభతరం చేస్తామని వెల్లడించారు. ఈ పథకం ద్వారా 22 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, రూ.400 కోట్లకుపైగా ఆదాయం సమకూరుతుందని, రూ.11 లక్షల కోట్లకుపైగా ఎగుమతులు జరుగుతాయని అంచనా వేశారు. కొన్ని ప్రాంతాలను గుర్తించి నైపుణ్యం గల బొమ్మల తయారీని ప్రోత్సహిస్తామని చెప్పారు.
గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా సౌకర్యంతో పాటు గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. ఈ-శ్రమ్ పోర్టల్ కింద గుర్తింపు కార్డులు, పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పించనున్నట్లు వివరించారు. ఈ నిర్ణయంతో కోటి మంది గిగ్ వర్కర్లకు ప్రయోజనం కలగనుంది.
More Stories
ఏపీలో ఆలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి
కొత్త సీఈసీగా జ్ఞానేశ్‌కుమార్
తెలంగాణాలో ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో!