జాలర్లపై శ్రీలంక నేవీ కాల్పులపై భారత్ ఆగ్రహం

జాలర్లపై శ్రీలంక నేవీ కాల్పులపై భారత్ ఆగ్రహం
భారత్‌కు చెందిన మత్స్యకారులపై శ్రీలంక నేవీ కాల్పులు జరపడంపై విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనలో ఐదుగురు మత్స్యకారులు గాయపడ్డారు. దీనిపై న్యూఢిల్లీలోని శ్రీలంక యాక్టింగ్ హైకమిషనర్‌కు భారత్ మంగళవారంనాడు సమన్లు పంపింది. తీవ్ర నిరసనను ఆయనకు తెలియజేసింది.

శ్రీలంక తీరంలోని డెల్ఫ్ట్ ఐలాండ్ సమీపానికి వెళ్లిన 13 మంది మత్స్యకారులను అక్కడి నౌకాదళం మంగళవారం తెల్లవారుజామున అడ్డుకుంది. పట్టుకునేందుకు కాల్పులు జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు భారత మత్స్యకారులు తీవ్రంగా గాయపడగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఆ వివరాలను, న్యూఢిల్లీ తీసుకున్న చర్యలను ఎంఈఏ ఒక ప్రకటనలో తెలియజేసింది. 

ఇండియాలోని శ్రీలంక హైకమిషనర్‌ను మంగళవారం ఉదయం పిలిపించి తీవ్ర నిరసన తెలియజేసినట్టు పేర్కొంది. పడవలో 13 మంది మత్స్యకారులు ఉండగా, ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో జాఫ్నా టీచింగ్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారని, స్వల్పంగా గాయపడిన మరో ముగ్గురికి కూడా చికిత్స జరుగుతోందని తెలిపింది.

మరోవైపు, జాఫ్నాలోని భారత కాన్సులేట్ అధికారులు సైతం ఆసుపత్రికి వెళ్లి గాయపడిన మత్సకారులను పరామర్శించారు. వారికి, వారి కుటుంబాలకు అవసరమైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ విషయాన్ని కొలంబో లోని ఇండియన్ హైకమిషన్ సైతం శ్రీలంక విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లింది. 

”ఎట్టి పరిస్థితుల్లోనూ బలప్రయోగం చేయడం ఆమోదయోగ్యం కాదు. ఈ విషయంలో ఇరు ప్రభుత్వాల మధ్య ఉన్న అవగాహనకు తూ.చ. తప్పకుండా పాటించాలి” అని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. శ్రీలంక‌, భార‌త్ మ‌ధ్య ఉన్న జాల‌ర్ల స‌మ‌స్య‌ను ప‌రిశీలించాల‌ని విదేశాంగ శాఖ తెలిపింది. కాగా, శ్రీలంక నౌకాదళం అరెస్టు చేసిన 13 మంది తమిళనాడు, కారైకాల్‌కు చెందిన మత్స్యకారులుగా తెలుస్తోంది.