తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీ

తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీ
తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీపై వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. ప్రధానంగా కృష్ణా న‌ది జలాల వాటాపై ఇబ్బందులు ఎక్కువగానే ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కేంద్రం పెద్దన్న పాత్రను పోషిస్తోంది. అయితే జల జగడంపై మరోసారి సుప్రీంకోర్టు తలుపును ఏపీ ప్రభుత్వం తట్టింది. కృష్ణా ట్రిబ్యునల్‌పై సుప్రీంకోర్టులో ఫిబ్రవరి 13న విచారణ జరగనుంది.
కృష్ణా ట్రైబ్యునల్‌ నీటి పంపకాల వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం మెన్షన్‌ చేసింది. ట్రైబ్యునల్‌ ముందు దాఖలైన రెండు రిఫరెన్స్‌ల విచారణ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. 2023 అక్టోబర్‌ 23వ తేదీన విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌‌పై బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది.
విభజన చట్టం ప్రకారం నీటి వాటాల పంపకంపై రెండు రిఫరెన్స్‌లను ట్రైబ్యునల్‌‌లో రెండు తెలుగు రాష్ట్రాలు దాఖలు చేశాయి. మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ మధ్య నీటి పంపకాలు చేస్తూ ఇప్పటికే బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పు వెలువరించింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత తలెత్తిన కృష్ణా నదీ నీటి పంపకాలపై ట్రైబ్యునల్‌ను తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. 

కృష్ణానది తమ భూభాగంలోనే ఎక్కువ ప్రవహిస్తుంది కాబట్టి రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తమకు 70 శాతం నీటి వాటా ఉండాలని, లేనిపక్షంలో రెండు రాష్ట్రాలకు 50 శాతం చొప్పున నీటిని పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ వ్యవహారంపై ట్రైబ్యునల్‌ తేల్చక ముందే 2023 అక్టోబర్‌ 10న కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. 

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ మధ్యనే నీటి పంపకాలను తేల్చాలని, దానిపైనే విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్‌‌ను దాఖలు చేసింది. తమ ముందు ఉన్న రెండు రిఫరెన్స్‌లలో 2023లో కేంద్రం విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ రిఫరెన్స్‌ పైనే ముందుగా విచారణ చేపడుతామని ఈనెల 16న కృష్ణా ట్రైబ్యునల్‌ తేల్చి చెప్పింది. 

ట్రైబ్యునల్‌ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం ప్రస్తావించింది. ఫిబ్రవరి 19న ట్రైబ్యునల్‌ రెండు రిఫరెన్స్‌లనే విచారణకు తీసుకుంటామని చెప్పిన విషయాన్నిసుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. తమ పిటిషన్‌పై త్వరగా విచారణ చేపట్టాలని ఏపీ న్యాయవాదులు కోరారు.  ఏపీ ప్రభుత్వం ప్రస్తావనను పరిగణనలోకి జస్టిస్‌ సూర్యకాంత్‌ , జస్టిస్‌ కోటేశ్వర్‌ సింగ్‌ల ధర్మాసనం తీసుకుంది. ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 2గంటలకు తదుపరి విచారణను చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.