ట్రంప్‌ `పౌరసత్వం’ నిర్ణయంపై అమెరికాలోని 22 రాష్ర్టాల దావా

ట్రంప్‌ `పౌరసత్వం’ నిర్ణయంపై అమెరికాలోని 22 రాష్ర్టాల దావా

* వ్యతిరేకిస్తున్న భారత- అమెరికన్‌ చట్టసభ్యులు

అమెరికాలో జన్మించే పిల్లలకు జన్మతః వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ట్రంప్‌ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ కోర్టుల్లో నాలుగు దావాలు దాఖలయ్యాయి. డెమాక్రటిక్‌ పార్టీ ఎక్కువ స్థానాలు గెలిచిన 22 రాష్ర్టాలతో పాటు కొలంబియా జిల్లా, శాన్‌ ఫ్రాన్సిస్కో నగరం ట్రంప్‌ నిర్ణయాన్ని బోస్టన్‌, సియాటిల్‌ కోర్టుల్లో సవాల్‌ చేశాయి.
ట్రంప్‌ తన అధికార పరిధిని దాటారని, అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని దావాల్లో పేర్కొన్నాయి. అమెరికన్‌ సివిల్‌ లిబర్టీస్‌ యూనియన్‌తో పాటు పలు వలసదారుల సంఘాలు సైతం ట్రంప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌కు వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయించాయి.

2025 ఫిబ్రవరి 19 తర్వాత జన్మించిన పిల్లల పౌరసత్వాన్ని నిలిపివేయాలని ఫెడరల్‌ ఏజెన్సీలను ట్రంప్‌ ఆదేశించారు. దీని వల్ల ఏటా దేశ వ్యాపితంగా 1,53,000 మంది, ఒక్క కాలిఫోర్నియాలోనే 24 వేల మంది దాకా పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారనుంది.  పత్రాలు లేని, తాత్కాలిక వీసాపై ఉన్న కుటుంబాలకు చెందిన వేలాది మంది పిల్లల జన్మహక్కును ఇది తొలగిస్తుంది.

ట్రంప్‌ ఎన్నికల వాగ్దానాల తర్వాత గ్రీన్‌ కార్డు సంస్కరణల కోసం ఎదురు చూస్తున్న భారతీయ అమెరికన్లను ఇది శరాఘాతమే. 1868లో ఆమోదించబడిన 14వ సవరణ” అమెరికాలో జన్మించిన లేదా సహజ సిద్ధమైన వ్యక్తులందరూ దాని అధికార పరిధికి లోబడి అమెరికా పౌరులు అవుతారు” అని స్పష్టంగా పేర్కొంది. ట్రంప్‌ చర్య ఇప్పటికే అమలులో ఉన్న సుప్రీం కోర్టు తీర్పులను సైతం ఉల్లంఘించేదిగా ఉంది.

ట్రంప్‌ నిర్ణయం అమలైతే అమెరికాలో ఏటా 1.50 లక్షల మంది పిల్లలకు పౌరసత్వాన్ని తిరస్కరించాల్సి వస్తుందని మసాచుసెట్స్‌ అటార్నీ జనరల్‌ అండ్రియా జాయ్‌ క్యాంప్‌బెల్‌ తెలిపారు. రాజ్యాంగ హక్కులను లాక్కునే అధికారం ట్రంప్‌నకు లేదని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ట్రంప్‌ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌తో జన్మతః పౌరసత్వం రద్దు కుదరదని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

‘ట్రంప్‌ చాలామంది ప్రజలను అసంతృప్తికి గురిచేసే చర్యకు దిగుతున్నారు. అంతిమంగా ఈ విషయాన్ని కోర్టులు నిర్ణయిస్తాయి. ట్రంప్‌ సొంతంగా తీసుకునే నిర్ణయం కాదిది’ అని అమెరికా రాజ్యాంగ నిపుణుడు, యూనివర్సిటీ ఆఫ్‌ వర్జీనియా లా స్కూల్‌ ప్రొఫెసర్‌ సాయికృష్ణ ప్రకాశ్‌ అభిప్రాయపడ్డారు.

ట్రంప్‌ ఉత్తర్వులను పాటించి అధికారులు పౌరసత్వాన్ని తిరస్కరిస్తే, వారు కోర్టును ఆశ్రయించవచ్చని, చివరకు సుప్రీంకోర్టు వరకు ఈ విషయం వెళ్లొచ్చని పలువురు నిపుణులు చెప్తున్నారు. జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని, ఇందుకు ప్రతినిధుల సభ, సెనేట్‌లో మూడింట రెండొంతుల సభ్యుల ఆమోదం, నాలుగింట మూడో వంతు రాష్ర్టాల ఆమోదం అవసరమని చెప్తున్నారు. 

ప్రస్తుతం రిపబ్లికన్‌ పార్టీకి ఉభయ సభల్లో ఉన్న మెజారిటీతో ఇది సాధ్యం కాదని అభిప్రాయపడుతున్నారు.  కాగా,జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్‌ ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వును అమెరికాలోని భారత సంతతి చట్టసభ్యులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయం కేవలం అక్రమ వలసదారులపైనే కాకుండా భారత్‌ నుంచి హెచ్‌1బీ వీసాలపై వచ్చిన విద్యార్థులు, నిపుణులపైనా ప్రభావం చూపుతుందని ఇండియన్‌-అమెరికన్‌ చట్టసభ్యుడు ఆర్. ఖన్నా పేర్కొన్నారు. 

స్టూడెంట్‌ వీసా, హెచ్‌1బి లేదా హెచ్‌2బి వీసా లేదా బిజినెస్‌ వీసాలపై వచ్చి తాత్కాలికంగా వుండే చట్టబద్ధమైన ఇమ్మిగ్రెంట్లకు కూడా తిప్పలు తప్పవని తెలిపారు. డొనాల్డ్‌ ట్రంప్‌ ఏం చెప్పారనేది, ఏం చేశారనేది విషయం కాదని, జన్మతః పౌరసత్వం కొనసాగుతుందని, ఇందుకోసం తాను పోరాడతానని మరో సభ్యుడు శ్రీ థానేదార్‌ స్పష్టం చేశారు. ట్రంప్‌ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, ఒక్క పెన్నుపోటుతో తీసుకోవాల్సినది కాదని మరో సభ్యురాలు ప్రమీలా జయపాల్‌ ఆరోపించారు.

ఇలా ఉండగా, అక్రమ వలసదారులపై ట్రంప్‌ మరో కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇంతవరకు పాఠశాలలు, చర్చ్‌లు వంటి సున్నితమైన ప్రదేశాల్లో అక్రమ వలసదారులను అరెస్టు చేయడానికి అవకాశం ఉండేది కాదు. ఈ ఆంక్షలను ట్రంప్‌ యంత్రాంగం తొలగించింది. 

ఇమ్మిగ్రేషన్‌ చట్టాలను అమలు చేసే అధికారులు ఎక్కడైనా చర్యలు తీసుకోవచ్చని, ఇక నుంచి నేరస్థులు అరెస్టును తప్పించుకునేందుకు పాఠశాలలు, చర్చ్‌లలో దాక్కోలేరని మంగళవారం అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ ప్రకటించింది. ఈ నిర్ణయంతో అక్రమ వలసదారులు వారి పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు కూడా భయపడుతున్నారు.