ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ప్రమాణంలో ప్రత్యేక ఆకర్షణగా ఉష

ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ప్రమాణంలో ప్రత్యేక ఆకర్షణగా ఉష
* ఉషనే ఉపాధ్యక్షురాలిగా ఎంపిక చేసుకోవాలి అనుకున్నా… ట్రంప్
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు స్వీకరించారు. యూఎస్‌ క్యాపిటల్‌లో సోమవారం రాత్రి ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌.. ట్రంప్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. ఇక అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్‌  సైతం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జేడీ వాన్స్‌ భార్య ఉషా చిలుకూరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
 
ఉషా చిలుకూరి వాన్స్‌పై ఆ దేశ నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశంసలు కురిపించారు. ప్రమాణస్వీకారం తర్వాత కార్యక్రమాన్ని ఉద్దేశించి ట్రంప్‌ ప్రసంగిస్తూ ‘చాలాకాలంగా జేడీ వాన్స్‌ను చూస్తున్నా. ఓహియో సెనేటర్‌గా పోటీ చేసినప్పుడు ఆయనకు మద్దతు తెలిపాను. వాన్స్‌ గొప్ప సెనేటర్‌. ఆయన భార్య ఉషా చాలా తెలివైన వారు. ఉపాధ్యక్షురాలిగా ఉషానే ఎంపిక చేసుకోవాల్సి ఉన్నా కుదరలేదు. వాన్స్‌ దంపతులిద్దరూ గొప్పవారు’ అంటూ ట్రంప్‌ పొగడ్త జల్లు కురిపించారు.

జేడీ వాన్స్‌ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో భార్య ఉషా చిలుకూరి వాన్స్‌, ముగ్గురు పిల్లలూ ఆయన పక్కనే ఉన్నారు. తన భర్త జేడీ వాన్స్‌ ఉపాధ్యక్షుడిగా ప్రమాణం చేస్తున్న సమయంలో ఉషా వాన్స్‌ ఆనందంతో ఉప్పొంగిపోయింది. తన భర్త వైపు ఎంతో గర్వంగా, ప్రేమగా చూస్తూ చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ తెలుగింటి అల్లుడు కావడం విశేషం. ఆయన భార్య ఉషా చిలుకూరి వాన్స్‌ తెలుగువారు. ఆమె తల్లిదండ్రులు క్రిష్‌, లక్ష్మి చిలుకూరి ఆంధ్రప్రదేశ్‌ నుంచి అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. అమెరికాలోని శాన్‌డియాగోలో ఉష జన్మించారు. యేల్‌ లా స్కూల్‌ నుంచి లా డిగ్రీ పూర్తి చేశారు. లా చదివే రోజుల్లోనే జేడీ వాన్స్‌తో ఆమెకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 

2014లో హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం కెంటకీలో వీరి వివాహం జరిగింది. ఉష, వాన్స్‌ దంపతులకు ఎవాన్‌, వివేక్‌, మిరాబెల్‌ రోజ్‌ అనే పిల్లలు ఉన్నారు. జేడీ వాన్స్‌ ఉపాధ్యక్షుడు కావడంతో అగ్రరాజ్యం అమెరికా సెకండ్‌ లేడీ హోదా ఉషకు దక్కింది. 

అమెరికా సెకండ్‌ లేడీ అయిన మొదటి ఏషియన్‌ అమెరికన్‌, హిందూ అమెరికన్‌ ఉషనే కావడం విశేషం. కాగా, మిలిటరీ జర్నలిస్టుగా, రచయితగా పేరొందిన జేడీ వాన్స్‌ 2022లో ఓహియో సెనేటర్‌గా విజయం సాధించారు. 2016లో ట్రంప్‌ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించి వాన్స్‌ ఆ తర్వాత ట్రంప్‌ మద్దతుదారుగా మారి, ఏకంగా ఉపాధ్యక్షుడిగా అవకాశం పొందారు.

చైనా దిగుమ‌తుల‌పై 10 శాతం ప‌న్ను

అమెరికా దేశాధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన డోనాల్డ్ ట్రంప్‌ తొలి రోజే కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. వ‌చ్చే నెల నుంచి చైనా దిగుమ‌తుల‌పై ప‌ది శాతం సుంకాన్ని విధించాల‌ని భావిస్తున్న‌ట్లు చెప్పారు. ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేద నుంచి ఆ సుంకం వ‌సూల్ చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు వెల్ల‌డించారు.  వైట్‌హౌజ్‌లో రిపోర్ట‌ర్ల‌తో మాట్లాడుతూ మెక్సికో, కెన‌డా రూట్లో చైనా అక్ర‌మంగా సింథ‌టిక్ డ్ర‌గ్ ఫెంటానిల్‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్లు ఆరోపించారు.
మెక్సికో, కెన‌డా దేశాల దిగుమ‌తుల‌పై 25 శాతం ప‌న్ను వ‌సూల్ చేయ‌నున్న‌ట్లు కూడా ట్రంప్ హెచ్చ‌రించారు. ఆ రెండు దేశాల నుంచి అక్ర‌మ వ‌ల‌స‌లు, డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా జ‌రుగుతున్న‌ట్లు చెప్పారు.  కాగా, రాబోయే అయిదేళ్ల‌లో ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌లో ప్రైవేటు రంగం సుమారు 500 బిలియ‌న్ల డాల‌ర్లు పెట్టుబ‌డులు పెట్ట‌నున్న‌ట్లు చెప్పారు. ఓపెన్ ఏఐ, సాఫ్ట్‌బ్యాంక్‌, ఒరాకిల్ లాంటి సంస్థ‌లు ఆ పెట్టుబ‌డి పెట్ట‌నున్నాయి.