అక్రమ వలసదారులను తిప్పి పంపుతా

అక్రమ వలసదారులను తిప్పి పంపుతా
 
* మూడో ప్రపంచ యుద్ధం జరగకుండా చూస్తా
 
మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఆపేస్తానని, చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా అక్రమ వలసదారులను దేశం నుంచి బయటకు పంపిస్తానని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా మరికొన్ని గంటల్లో ట్రంప్‌ ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా వాషింగ్టన్‌ డీసీలో నిర్వహించిన ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగెయిన్‌’ విక్టరీ ర్యాలీని ఉద్దేశించి ట్రంప్‌ ప్రసంగించారు. 
 
ర్యాలీకి చాలా మంది స్నేహితులు, మద్దతుదారులు, నిజమైన అమెరికన్‌ దైశభక్తులు హాజరైనందుకు సంతోషంగా ఉందని తెలిపారు.  ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధాన్ని ఆపుతానని ఆయన ప్రకటించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను చల్లార్చే బాధ్యతను తీసుకుంటానని తెలిపారు.
“మన దేశాన్ని మనం తిరిగి స్వాధీనం చేసుకోబోతున్నాం. రేపు యాహ్నం నాటికి నాలుగేండ్ల అమెరికా క్షీణతకు తెరబడపోతున్నది. అమెరికన్‌ బల, శ్రేయస్సు, గౌరవం, గర్వంతో సరికొత్త రోజును ప్రారంభించబోతున్నాం” అని చెప్పారు.
అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే, బైడెన్ పరిపాలన జారీ చేసిన డజన్ల కొద్దీ “విధ్వంసక, తీవ్రమైన” కార్యనిర్వాహక ఆదేశాలను రద్దు చేస్తానని, సోమవారం చివరి నాటికి ఆ ఆదేశాలను “శూన్యమైనవి”గా ప్రకటిస్తానని ట్రంప్ వెల్లడించారు. దాదాపు 100 కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేస్తానని చెబుతూ వలసలు, ద్రవ్యోల్బణం, సరిహద్దు భద్రతతో సహా దేశం ఎదుర్కొంటున్న బహుళ సవాళ్లను పరిష్కరించడానికి తన పరిపాలన నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తుందని తెలిపారు. 

“తాను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మన దేశంపై అక్రమ వలసదారుల దండయాత్ర ఆగిపోతుంది. సరిహద్దుల నుంచి అక్రమంగా ప్రవేశించడాన్ని ఆపేస్తాం. ఇక మన సంపదను మనమే అనుభవిస్తాం. అక్రమంగా వలస వచ్చిన వేలాది మందిని బలవంతంగా సాగనంపే కార్యక్రమం అమెరికా చరిత్రలోనే భారీగా మొదలు పెడతాం” అని ట్రంప్ స్పష్టం చేశారు.

“ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తాం. టిక్‌టాక్‌ యాప్‌ను మళ్లీ తీసుకొచ్చాం. మన ఉద్యోగాలు చైనాకు పోవడానికి వీల్లేదు. అందుకే టిక్‌టాక్‌ యాప్‌లో అమెరికా ప్రభుత్వం 50 శాతం భాగస్వామ్యం తీసుకుంటుంది. మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్లు పాల్గొనకుండా నిలువరిస్తా” అని వెల్లడించారు. 

“మూడో ప్రపంచ యుద్ధాన్ని నిలువరిస్తా. రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తా. మధ్య ప్రాశ్చంలో శాంతి నెలకొనేలా చేస్తా. అధికారం చేపట్టకముందే ట్రంప్‌ ఎఫెక్ట్‌తో ఇప్పటికే కొన్ని పనులు జరిగిపోతున్నాయి. ఇది నా ప్రభావం కాదు. మీ అందరి ప్రభావం” అని తెలిపారు.  “గత ుగేళ్లుగా అమెరికా క్షీణతను చూసింది. ఆ క్షీణ దశకు ఇప్పుడు తెరపడింది. ఇక మేం అమెరికాను మళ్లీ పైకి తెస్తాం. ఎందుకంటే మేం గెలిచాం” అని ట్రంప్ తెలిపారు. దేశంలోని అవినీతిమయ రాజకీయ వ్యవస్థను అంతం చేస్తామని స్పష్టం చేశారు.

“మేం ఎన్నికల్లో గెలవడం వల్లే అమెరికాలోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ప్రఖ్యాత సాఫ్ట్ బ్యాంక్ మన దేశంలో 100 బిలియన్ డాలర్ల నుంచి 200 బిలియన్ డాలర్ల దాకా పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్ కూడా ఈ దిశగా ప్రకటన చేశారు” అని ట్రంప్ పేర్కొన్నారు. అంతకు ముందు వర్జీనియాలోని అర్లింగ్టన్ జాతీయ శ్మశాన వాటికలో నిర్వహించిన కార్యక్రమంలో ట్రంప్, కాబోయే దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాల్గొన్నారు. ఆ శ్మశాన వాటికలోని గుర్తుతెలియని సైనికుల సమాధులపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.

కాగా, టిక్‌టాక్‌ను తిరిగి ప్రారంభిస్తున్నామన్న ట్రంప్‌ ప్రకటనపై షార్ట్‌ వీడియో యాప్‌ కంపెనీ ధన్యవాదాలు తెలిపింది. బైడెన్‌ ప్రభుత్వ నిర్ణయంతో శనివారం నుంచి అమెరికాలో టిక్‌టాక్‌ యాప్‌ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. తాను అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత టిక్‌టాక్‌ యాక్సెస్‌ను పునరుద్ధరిస్తామని ట్రంప్‌ ప్రకటించారు. విక్టరీ ర్యాలీలో ప్రసంగిస్తూ టిక్‌టాక్‌లో అమెరికా 50 శాతం భాగస్వామ్యం తీసుకుందని చెప్పారు. దీంతో తమకు భరోసా ఇచ్చినందుకు ఈ చైనా కంపెనీ కృతజ్ఞతలు తెలిపింది.