కోల్​కతా ట్రైనీ డాక్టర్​ హత్యాచార కేసు దోషికి జీవిత ఖైదు

కోల్​కతా ట్రైనీ డాక్టర్​ హత్యాచార కేసు దోషికి జీవిత ఖైదు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్‌జీకార్‌ వైద్య కళాశాల ట్రెయినీ డాక్టర్‌పై లైంగిక దాడి, హత్య కేసులో అరెస్టయిన సంజయ్‌ రాయ్‌ ను న్యాయస్థానం శనివారం దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అతడికి కోల్‌కతాలోని సీల్దా కోర్టు జీవితఖైదు విధించింద చనిపోయే వరకు జైలు శిక్ష విధిస్తు, అతడికి రూ.50 వేలు జరిమానా కూడా విధించింది. 
 
అంతేకాదు బాధిత కుటుంబానికి రూ.17లక్షల పరిహారం ఇవ్వాలని పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.అందులో రూ 10 లక్షలు ఆమె హత్యకు గురైనందుకు, రూ 7 లక్షలు అత్యాచారంపై గురైనందుకు అని తెలిపింది.   ఈ కేసులో నిందితుడు సంజయ్‌రాయ్‌ను భారతీయ న్యాయసంహితలోని 64, 66, 103/1 సెక్షన్ల కింద శనివారం న్యాయమూర్తి నిందితుడిగా తేల్చారు.

కాగా, 2024 ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్‌జీకార్‌ ఆసుపత్రిలో సెమినార్‌ రూమ్‌ టరిగా నిద్రిస్తున్న జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కాగా ఆర్‌జీకార్‌ దవాఖాన డాక్టర్లు, వైద్య విద్యార్థులు సుదీర్ఘకాలం ఆందోళనలు నిర్వహించారు.

ఘటన అనంతరం ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా సంజయ్‌ను ఆగస్టు 10న కోల్‌కతా పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం ఈ కేసును సీబీఐ విచారించింది. ప్రధాన నిందితుడిగా సంజయ్‌ రాయ్ పేరును ఛార్జ్‌షీట్‌లో చేర్చి కోర్టుకు సమర్పించింది. దీనిపై గత వారం విచారణ జరిపిన కోల్‌కతాలోని సీల్దా కోర్టు సంజయ్‌ రాయ్‌ని దోషిగా నిర్ధారించింది. ఈ మేరకు ఇవాళ దోషికి శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది.

మరోవైపు కోర్టులో విచారణ సందర్భంగా సంజయ్‌ రాయ్‌ తాను నిర్దోషినని, ఈ కేసులో తనను ఇరికించారని చెప్పాడు. తనను ఈ కేసులో ఇరికించిన ఐపీఎస్‌ అధికారితోసహా అందరినీ ఎందుకు విడుదల చేశారని అతను ప్రశ్నించాడు. ఈ కేసులో సాక్ష్యాలను మార్చినందుకు ఆర్‌జీ కర్‌ మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌తోపాటు స్థానిక పోలీసు స్టేషన్‌ మాజీ ఎస్‌హెచ్‌ఓకు బెయిల్‌ ఇవ్వడాన్ని రాయ్‌ ప్రశ్నించాడు.

 అయితే,  సీబీఐ తరఫు న్యాయవాది మాట్లాడుతూ ఇది చాలా అరుదైన కేసని, ఈ ఘటన పౌర సమాజాన్ని ఎంతగానో కలచి వేసిందని గుర్తు చేశారు. దోషి సంజయ్‌రాయ్‌కు ఉరిశిక్ష విధించాలని కోరారు. వైద్యులకే రక్షణ లేకపోతే ఇంకేం చేయాలని, మరణశిక్ష మాత్రమే సమాజంలో విశ్వాసాన్ని పునరుద్ధరించగలదని వాదించారు.

న్యాయమూర్తి తీర్పును ప్రకటించిన అనంతరం పోలీసులు దోషిని కోర్టు రూము నుంచి గట్టి బందోబస్తు మధ్య ప్రెసిడెన్సీ కరెక్షనల్‌ హోమ్‌కు తరలించారు. న్యాయమూర్తి తీర్పు విని బాధితురాలి తండ్రి భావోద్వేగానికి గురై విలపించారు. న్యాయవ్యవస్థపై తాము ఉంచుకున్న నమ్మకాన్ని న్యాయస్థానం నిలబెట్టుకుందని ఆయన తెలిపారు. 

ఘటన జరిగిన 162 రోజుల తర్వాత జనవరి 18న ఈ కేసులో తీర్పు వచ్చింది. సియాల్దా కోర్టులో ర్యంా సాగిన విచారణలో ఇరుపక్షాల వాదనలు ఈ నెల 9న పూర్తయ్యాయి. వైద్యురాలిపై సంజయ్‌రాయ్‌ అత్యాచారానికి పాల్పడి, ఆ తర్వాత గొంతు నులిమి హతమార్చినట్లు సీబీఐ రుజువు చేయగలిగిందని జడ్జి పేర్కొన్నారు.