90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిన ఇజ్రాయెల్‌

90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిన ఇజ్రాయెల్‌

ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధానికి ముగింపు పడింది. ఇరు పక్షాల మధ్య చిరకాలంగా ఎదురుచూస్తున్న కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇరు పక్షాలు తమ వద్ద బందీలుగా ఉన్న వారిని విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగా రోమి గోనెన్‌, ఎమిలీ దామరి, డోరోన్‌ స్టీన్‌బ్రెచర్‌ అనే ముగ్గురు మహిళా బందీలను హమాస్‌ ఆదివారం విడుదల చేసింది. 

ప్రతిగా ఇజ్రాయెల్‌ కూడా తమ జైళ్లలో ఉన్న 90 మంది పాలస్తీనియనన్లకు విముక్తి కల్పించింది. వారిని రెడ్‌క్రాస్‌ సంస్థకు అప్పగించింది. దీంతో సోమవారం వారు ప్రత్యేక బస్సుల్లో గ్రాజా స్ట్రిప్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి పాలస్తీనా ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. వారిని చూసేందుకు భారీ సంఖ్యలు పాలస్తీనియన్లు తరలివచ్చారు. ఇన్నాళ్లు ఇజ్రాయెల్‌ చెరలో ఉన్న తమ వారిని చూసుకుని కుటుంబ సభ్యులు కంటతపడిపెట్టారు.

కాగా, ఒప్పందంలో భాగంగా తొలి విడతగా ఇజ్రాయెల్‌ 90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. తర్వాత విడత వార మొ్తం 2,000 మందిని వదిలిపెడుతుంది. హమాస్‌ కూడా ఇప్పటికే ముగ్గురిని విడుదల చేయగా, రానున్న ఆరు వారాల్లో మిగిలిన 33 మందిని కూడా వదిలివేయనున్నట్టు ప్రకటించింది.

అంతకు ముందు 42 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం అమలును హమాస్‌ మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభించింది. ఒప్పందం అమలు కొన్ని గంటలు ఆలస్యం కావడంతో ఈలోగా ఖాన్‌యూనిస్‌ నగరం దక్షిణ భాగంపై ఇజ్రాయెల్‌ వాయుసేన దాడులు కొనసాగించింది. ఈ దాడుల్లో 26 మంది మరణించినట్టు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 

సాంకేతిక క్షేత్ర కారణాల వల్లే ఒప్పందం అమలు ఆలస్యమైనట్టు హమాస్‌ పేర్కొంది. కాల్పుల విరమణ ఒప్పందానికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. కాగా, కాల్పుల విరమణ నేపథ్యంలో మానవతా సహాయన్ని అందించేందుకు గాజా స్ట్రిప్‌కి భారీగా ట్రక్కులు చేరుకుంటున్నాయి.  సుమారు 630కిపైగా ట్రక్కుల్లో పెద్దమొత్తంలో నిత్యావసర సరుకులతోపాటు వివిధ వస్తువులు వచ్చాయని ఐక్యరాజ్యసమితి అధికారులు వెల్లడించారు. వాటిలో 300 ట్రక్కులు గాజాకు ఉత్తరాది నుంచి చేరుకున్నాయని చెప్పారు.  యుద్ధంతో దెబ్బతిన్న గాజాలో ఆదివారం పౌరుల సంబరాలు మిన్నంటాయి. 

యుద్ధ భయంతో 15 నెలల క్రితం ఇళ్లు, ఆస్తులను వదిలి బతుకు జీవుడా అంటూ వెళ్లిపోయిన లక్షలాది మంది పాలస్తీనియన్లు తమ ఇళ్లకు తిరిగి రావడం ప్రారంభించారు. ఒక పక్క కాల్పుల విరమణ ఒప్పందం ప్రారంభం కాలేదు, మరో పక్క ఇజ్రాయెల్‌ తన వాయుసేన దాడులు కొనసాగిస్తూనే ఉంది, అయినా లక్ష్యపెట్టక వేలాది మంది పౌరులు కాలినడక, గాడిదలు లాగే బండ్లపై గాజాకు చేరుకోవడం కన్పించింది. 

15 నెలల పాటు సాగిన ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంలో 46 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. వారిలో సగం మంది మహిళలు, పిల్లలే. 1.10 లక్షల మంది గాయపడ్డారు. 23 లక్షల మంది ఉన్న జనాభాలో 19 లక్షల మంది దేశం వదిలి శరణార్థులుగా మారారు. ఇజ్రాయెల్‌ కురిపించిన బాంబుల వర్షానికి భవనాలు, ఇళ్లు శిథిలాలుగా మారాయి. 

69 శాతం ఆస్తులు ధ్వంసం అయినట్టు ఐక్యరాజ్య సమితి గత నెలలో అంచనా వేసింది. వీని పునరుద్ధరించానికి కొన్ని దశాబ్దాలు పడుతుందని అంచనా వేస్తున్నారు. పేరుకుపోయిన శిథిలాలను తొలగించడానికే 15 ఏండ్లు పడుతుందని తెలిపారు. కాగా, 2014లో ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధంలో మరణించిన తమ సైనికుడు ఓరన్‌ సాహుల్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఇజ్రాయెల్‌ ఒక ప్రకటనలో తెలిపింది.