బడ్జెట్‌ సమావేశాల్లో కొత్త ఆదాయం పన్ను బిల్లు

బడ్జెట్‌ సమావేశాల్లో కొత్త ఆదాయం పన్ను బిల్లు

ఆదాయం పన్ను చట్టం-1961 స్థానంలో కొత్త ఆదాయ పన్ను చట్టం రానున్నట్లు తెలుస్తోంది. వచ్చే బడ్జెట్‌ పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. ‘కొత్త ఆదాయ పన్ను బిల్లు’ను ప్రతిపాదించనున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఆదాయం పన్ను చట్టాన్ని సరళతరం చేసి కొత్త చట్టం తీసుకొస్తారు. 

ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేసే పేజీల సంఖ్యను సుమారు 60శాతం తగ్గించి, సమగ్ర ఆదాయం పన్ను చట్టం రూపొందిస్తారు. 2024 జూలైలో 2024-25 ఆర్థిక సంవత్సర పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశ పెడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆరు నెలల్లో పాత ఆదాయం పన్ను చట్టం-1961పై సమగ్రంగా సమీక్షిస్తామని ప్రకటించారు. 

ఈ నెల 31 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్‌ పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశ పెడతారు. కొత్త ఆదాయం పన్ను చట్టం రూపొందిస్తారు తప్ప ప్రస్తుత చట్టానికి సవరణలు కాదని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ముసాయిదా బిల్లు కేంద్ర న్యాయశాఖ పరిశీలనలో ఉంది. మలి విడత బడ్జెట్‌ పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశ పెడతారని తెలుస్తున్నది.

పాత కాలం నాటి ఆదాయం పన్ను చట్టం -1961పై సమీక్షించి సమగ్ర నివేదిక తయారు చేడానికి కేంద్ర ్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఒక అంతర్గత కమిటీ నియమించింది. సంక్షిప్తంగా, స్పష్టంగా తేలిగ్గా అర్ధం చేసుకునే విధంగా ప్రతిపాదిత బిల్లు ఉంటుంది. వివాదాలు, వ్యాజ్యాలు తగ్గించడానికి పరిష్కార మార్గాలు ప్రతిపాదిస్తారు. 

పాత ఆదాయం పన్ను చట్టంలోని వివిధ అంశాలను సమీక్షించేందుకు 22 స్పెషలైజ్డ్‌ సబ్‌ కమిటీలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే చట్టం సమీక్షించడానికి ప్రజల నుంచి 6500 సూచనలు వచ్చాయి. ప్రస్తుతం చట్టం 298 సెక్షన్లు, 23 చాప్టర్లు కలిగి ఉంది. ప్రత్యక్ష పన్నులకు సంబంధించిన ఆదాయం పన్ను చట్టం-1961లో వ్యక్తిగత ఆదాయం పన్ను, కార్పొరేట్‌ పన్ను, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్‌ టాక్స్‌, గిఫ్ట్‌ టాక్స్‌, వెల్త్‌ టాక్స్‌ వస్తాయి.