ఇస్లామాబాద్‌లో చర్చలు ముందుకు సాగలేదనే విషయం తెలియగానే అంతర్జాతీయ చమురు మార్కెట్ తిరిగి కుదుపులకు గురైంది. కొద్దిరోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన ధరలు ఇప్పుడు తిరిగి పెరిగాయి. సోమవారం బ్రెంట్ క్రూడాయిల్ ధర అంతర్జాతీయ స్థాయిలో బ్యారెల్‌కు 95 డాలర్లకు ఎగబాకింది, ఫిబ్రవరి 28, 2026న ఇరాన్‌లో కొత్త సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుండి, ప్రపంచ చమురు ధరలు సుమారు 35 నుండి 50 శాతం వరకు పెరిగాయి.
బ్రెంట్ క్రూడ్ ధర యుద్ధానికి ముందు బ్యారెల్‌కు $70 ఉండగా, మార్చిలో అది బ్యారెల్‌కు $119కి పైగా పెరిగి గరిష్ట స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం, చమురు ధరలు బ్యారెల్‌కు $100 కంటే తక్కువకు పడిపోయాయి. అయినప్పటికీ, ధరలు అస్థిరంగానే ఉన్నాయి. హర్మూజ్ మీదుగా నౌకా రవాణాను మరింత కట్టుదిట్టంగా అడ్డుకుంటామని ఇరాన్ సోమవారం తెలిపింది. దీనితో ఇప్పటికే ఇక్కడ రవాణాకు నిలిచిపోయి ఉన్న వందలాది చమురు నౌకలు మరింత ఆటుపోట్లకు గురయ్యాయి.
హర్మూజ్‌పై ట్రంప్ ప్రకటనలతో ఈ ప్రాంతంలో మరింత ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్ అనుమతి ఉన్న భారత్ వంటి కొన్ని దేశాలు కూడా ఈ మార్గం ద్వారా వెంటనే నౌకల రవాణా సురక్షితమేనా అనే సంశయంలో పడ్డాయి. అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు ఎటువంటి స్పష్టమైన ఫలితం లేకుండా ముగియడంతో, హోర్ముజ్ జలసంధిలో అంతరాయం కొనసాగే అవకాశం ఉంది.
ప్రస్తుత పరిస్థితిని అంగీకరిస్తూ, అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్ రైట్, అమెరికాలో గ్యాసోలిన్ (పెట్రోల్) ధరలు ముందుగా ఆశించిన దానికంటే ఎక్కువ కాలం పాటు $3 కంటే ఎక్కువగా ఉండవచ్చని తెలిపారు. ధరలు గరిష్ట స్థాయికి చేరి ఉండవచ్చని, కానీ అవి నెలల తరబడి, బహుశా అంతకంటే ఎక్కువ కాలం పాటు అధికంగానే కొనసాగవచ్చని ఆయన పేర్కొన్నారు.
‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ కార్యక్రమంలో మాట్లాడుతూ, పంపు వద్ద అమెరికన్లు మళ్లీ గ్యాలన్‌కు $3 ధరను ఎప్పుడు చూస్తారో తాను చెప్పలేనని రైట్ స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసిన తర్వాత, ఇరాన్ యుద్ధానికి ముందు గ్యాలన్‌కు $3 సమీపంలో ఉన్న ధరలు అప్పటికే “చాలా అద్భుతమైనవి” అని ఆయన పేర్కొన్నారు.

More Stories
2027లో జిడిపి వృద్ధి 6.8 నుంచి 7.1 శాతం..ఎస్బిఐ రీసెర్చ్
భారతదేశంలో 13 శాతం తగ్గిన ఎల్పీజీ గ్యాస్ వినియోగం
అమెరికా కోర్టులో విచారణకు మరింత సమయం కోరిన అదానీ