ముడా స్కామ్‌లోరూ. 300 కోట్ల ఆస్తుల జప్తు

ముడా స్కామ్‌లోరూ. 300 కోట్ల ఆస్తుల జప్తు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిందితుడిగా ఉన్న మైసూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా) భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసుపై ఈడీ కీలక ప్రకటన చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న వారికి చెందిన 140 స్థిరాస్తులను స్వాధీనం చేసుకున్నట్టు శుక్రవారం ప్రకటించింది. వీటి విలువ రూ.300 కోట్లు ఉంటుందని తెలిపింది. 
 
రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, ఏజెంట్లుగా పని చేస్తున్న వారి పేర్లతో ఈ ఆస్తులు ఉన్నట్లు చెప్పింది.  ఈ కేసుకు సంబంధించి సోదాలు జరిపినప్పుడు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతికి కేటాయించిన 14 స్థలాలే కాకుండా ఇంకా భారీగా అక్రమాలు జరిగాయని గుర్తించినట్లు ఈడీ తెలిపింది. 
 
తక్కువ విలువైన భూములకు పరిహారం రూపంలో అనేక ఖరీదైన స్థలాలను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు ముడా అప్పగించిందని వెల్లడించింది. బినామీల పేర్లతో ఈ స్థలాలను పొందిన వ్యాపారులు వీటిని అమ్మేసి భారీగా అక్రమ నగదును పొందారని చెప్పింది. ఇందుకు బదులుగా అప్పటి ముడా చై్మన్‌, కమిషనర్‌కు స్థిరాస్తులు, ముడా స్థలాలు, నగదు రూపంలో లంచాలు చెల్లించినట్టు ఆధారాలు లభించాయని తెలిపింది.ముడా భూకుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణికి భారీ లబ్ధి కలిగిన విషయాన్ని కూడా ఈడీ స్పష్టం చేసింది. సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతి నుంచి ముడా 3 ఎకరాల 16 గుంటల భూమిని మొదట రూ.3,24,700కు సేకరించిందని తెలిపింది. ఆ తర్వాత ఖరీదైన ప్రాంతంలో 14 స్థలాలను పరిహారంగా ఇచ్చిందని, వీటి విలువ రూ.56 కోట్లు ఉంటుందని వెల్లడించింది. 

కాగా, సిద్ధరామయ్య తన పలుకుబడిని ఉపయోగించి ఇలా ఖరీదైన స్థలాలను పరిహారంగా దక్కేలా చేశారనే ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే సిద్ధరామయ్యను కర్ణాటక లోకాయుక్త పోలీసులు సైతం విచారించారు.