ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి దామోదర్ మృతి

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి దామోదర్ మృతి

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం జరిగిన పోలీసుల కాల్పుల్లో 18 మంది మావోయిస్టులు మరణించారు. అయితే, ఈ కాల్పుల్లో మావోయిస్టు పార్టీ కీల‌క నేత, పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మరణించాడు. దామోద‌ర్ చనిపోయినట్లు మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. 

దామోదర్ స్వస్థలం ములుగు జిల్లా కాల్వపల్లి కాగా, ఆయ‌న‌ దాదాపు 30 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో పనిచేశారు. క్రమంగా ఆపార్టీలో ఎదుగుతూ ఆరు నెలల క్రితమే మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికయ్యారు. రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న హరిభూషణ్ కరోనా కాలంలో మృతి చెందడంతో ఆయన స్థానంలో బడే చొక్కారావుకు తెలంగాణ పార్టీ బాధ్యతలను అప్పగించింది. 

ఇలా ఉండగా, బడే చొక్కారావు భార్య రజితను 2023లో పోలీసులు అరెస్టు చేశారు. మృతుల్లో బడే చొక్కారావుతో పాటు మరో తెలుగు నేత నర్సింహారావు రావు కూడా ఉన్నట్లు మావోయిస్టు పార్టీ దక్షిణ బస్తర్ కార్యదర్శి గంగా లేఖలో పేర్కొన్నారు. మూడు దశాబ్దాల పగా పీపుల్స్‌వార్ పార్టీ అనంతరం మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ పోలీసులకు ముప్పుతిప్పలు పెట్టి మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా పేరుగాంచారు. 

దామోదర్‌పై ఛత్తీస్‌గఢ్‌లో రూ.50 లక్షల రివార్డు ఉండగా, తెలంగాణలోనూ రూ.25లక్షల రివార్డు ఉంది. మావోయిస్టు యాక్షన్ టీమ్‌లకు ఆయన ఇన్‌చార్జిగా కూడా వ్యవహరించారు. బీజాపూర్ జిల్లా బాసగూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలిన ఘటనలో కోబ్రా బెటాలియన్ కానిస్టేబుళ్లు గాయపడ్డారు. 

దీంతో ఆ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల శిభిరం ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు నక్సల్స్ కోసం కూంబింగ్ నిర్వహించారు. ఆ సందర్భంగా మావోయిస్టులు, పోలీసు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో 18 మంది మావోయిస్టులు మృతిచెందగా, వారిలో దామోదర్ ఉన్నట్లు మావోయిస్టుపార్టీ పేర్కొంది.  బడే చొక్కారావు అలియాస్ దామోదర్ సోదరుడు బడే నాగేశ్వరరావు కూడా ఉద్యమబాటలోనే కొనసాగి అశువులుబాశారు. ఆయన వరంగల్ జిల్లా పీపుల్స్ వార్ గ్రూప్ జిల్లా కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న సమయంలోనే లక్నవరం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు.

బీజాపూర్‌, సుక్మా, దంతేవాడ జిల్లాల డీఆర్‌జీ జవాన్లతోపాటు కోబ్రా, సీఆర్‌పీఎఫ్‌కు చెందిన సుమారు 1,500 మంది బలగాల సంయుక్త ఆధ్వర్యంలో సెర్చింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. దీంతో మావోయిస్టులు తలపెట్టిన భారీ ప్లీనరీ భగ్నమైనట్లు తెలుస్తున్నది. 

మృతిచెందిన వారిలో సోంబేడి అలియాస్‌ సోమిడి(ఏసీఎం డిప్యూటీ కమాండర్‌), కిశోర్‌(ఏసీఎం), లాలు(పార్టీ సభ్యుడు), సోని(ఏసీఎం), మున్న, హిదుమా అలియాస్‌ ఇడుమ అలియాస్‌ ఇర్మ, సాంట అలియాస్‌ శ్వేత, గంగి(ఏసీఎం), కోవాసి, రత్న, కుసబ అలియాస్‌ కేశవ, అండాలు(పార్టీ సభ్యురాలు), దవాజ అలియాస్‌ రజిత(పార్టీ సభ్యురాలు), శాంతి(పార్టీ సభ్యురాలు), మైను అలియాస్‌ సాంబు, రాములు అలియాస్‌ రామలు(పార్టీ సభ్యుడు) ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.