
పంజాబ్, హరియాణా రాష్ట్రాల సరిహద్దుల్లోని ఖనౌరీ, శంభు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్న రైతు నేతలు ఫిబ్రవరి 14న చండీగఢ్ వేదికగా చర్చలకు రావాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే కేంద్రంతో చర్చల్లో చురుగ్గా పాల్గొనేందుకు వైద్యసాయం పొందాలని జగ్జీత్ సింగ్ దల్లేవాల్‌ను మిగతా రైతునేతలు కోరారు.
54 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తూ తీవ్రంగా నీరసించిపోయిన డల్లేవాల్ వైద్యసాయం పొందేందుకు అంగీకరించారు. దానితో వెంటనే అక్కడే ఎదురు చూస్తున్న వైద్య బృందాలు ఆయనకు చికిత్సను ప్రారంభించాయి. అయితే, కనీస మద్దతు ధరకు కేంద్రం చట్టబద్దత కల్పించేందుకు ఒప్పుకొనేవరకు తాను ఆహారం తీసుకోనని స్పష్టం చేశారు.
ఆయనకు మద్దతుగా 10 మంది హర్యానా రైతులతో పాటు అంతకు ముందు నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన 111 మంది రైతులు సహితం దిరం మధ్యాహ్నం తమ దీక్షను విరమించేందుకు అంగీకరించారు. జాయింట్ సెక్రటరీ హోదాలోని అధికారి ప్రియా రంజన్ సారథ్యంలో కేంద్ర ప్రతినిధుల బృందం ఖనౌరీ వద్ద డల్లేవాల్‌తో పాటు సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతలతో శనివారం సుమారు రెండు గంటలపాటు సమావేశమయ్యారు.
ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా ఎన్నికల తర్వాత చర్చల తేదీని ప్రతిపాదిస్తున్న ట్లు కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. మొదటి సమావేశం చండీగఢ్‌లో, రెండవ సమావేశం ఢిల్లీలో జరగాలని దల్లెవాల్ కోరిక వ్యక్తం చేశారని రైతు నేత కాకా సింగ్ కోట్రా తెలిపారు. హర్యానాతో పంజాబ్ సరిహద్దులో నిరసన తెలుపుతున్న వ్యవసాయ సంఘాలు తమ డిమాండ్లకు సంబంధించి కేంద్రం నుండి “మంచి ప్రతిపాదన” వచ్చిందని చెప్పడంతో ఈరోజు ఖనౌరిలో ఉత్కంఠభరితమైన కార్యకలాపాలు కనిపించాయి.
ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడంలో పంజాబ్ మాజీ డిఐజి నరీందర్ భార్గవ్ మరియు మాజీ ఎడిజిపి జస్కరన్ సింగ్ కీలక పాత్ర పోషించారని తెలుస్తున్నది. గత ఏడాది ఫిబ్రవరి 18 తర్వాత కేంద్ర ప్రతినిధులు నిరసన తెలుపుతున్న రైతు నాయకులతో వారి డిమాండ్లపై అధికారికంగా చర్చలు జరపడం ఇదే మొదటిసారి.
More Stories
ఖతార్ అధినేతకు స్వయంగా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి మోదీ స్వాగతం!
కొత్త సీఈసీగా జ్ఞానేశ్‌కుమార్
రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నియంత్రణకు కుత్రిమ మేధ