ఐక్యత, సమానత్వం అసాధారణ సంగమంగా మహాకుంభ మేళా

ఐక్యత, సమానత్వం అసాధారణ సంగమంగా మహాకుంభ మేళా
మహాకుంభ మేళా ఐక్యత, సమానత్వం అసాధారణ సంగమంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయంలో ఎక్కడా వివక్షత, కులతత్వం లేదని స్పష్టం చేశారు. ప్రధాని ఆదివారం ‘మన్‌ కీ బాత్‌’ రేడియో కార్యక్రమంలో ప్రసంగిస్తూ మహాకుంభ మేళాలో యువత పాల్గొనడంపై హర్షం వ్యక్తం చేశారు.
 
యువతరం ఆచార వ్యవహారాలను తెలుసుకున్నప్పుడే మన మూలాలు బలపడుతాయని చెబుతూ  ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రపంచ దేశాల నుంచి వస్తున్న ఆదరణ భారతీయులకు గర్వకారణమని తెలిపారు. మహాకుంభ మేళా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచిందన్న ప్రధాని అన్ని ప్రాంతాల, వర్గాల ప్రజలను ఒక్కతాటిపైకి తీసుకువచ్చిందని చెప్పారు.

ఈ సందర్భంగా జనవరి 25న జరుపుకునే జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఈ రిపబ్లిక్‌ డే చాలా ప్రత్యేకమైందని చెబుతూ ఈ సంవత్సరం భారత రాజ్యాం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతుందని తెలిపారు. పవిత్రమైన రాజ్యాంగాన్ని మనకు అందించిన రాజ్యాంగ పరిషత్‌లోని గొప్ప వ్యక్తులకు తలవంచి నమస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. 

ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను ఎప్పటికప్పుడు ఆధునీకరించి, పటిష్ఠం చేస్తుందని ప్రధాని తెలిపారు. ప్రజాశక్తిని బలోపేతం చేయడానికి సాంకేతికతను ఉపయోగిస్తూ నిష్పక్షపాతంగా పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తుందని కొనియాడారు. అలాగే, అయోధ్య రామమందిరం వార్షికోత్సవంపై వ్యాఖ్యానించారు.  వాస్తవానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెలా చివరి ఆదివారం మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. ఈ నెల చివరి ఆదివారం రోజున రిపబ్లిక్‌ డే నేపథ్యంలో మూడో ఆదివారం రోజున మన్‌ కీ బాత్‌ 118వ ఎపిసోడ్ ప్రసారమైంది.