
సరిహద్దు ఉద్రిక్తతలపై భారత్ హైకమిషనర్ ప్రణయ్ వర్మను బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం సమన్ చేసింది. ద్వైపాక్షిక ఒప్పందానికి విరుద్ధంగా భారత బంగ్లాదేశ్ సరిహద్దు పొడుగునా ఐదు చోట్ల కంచె నిర్మాణానికి భారత్ ప్రయత్నిస్తోందని ఢాకా ఆరోపించిన కొన్ని గంటల తరువాత ఈ పరిణామం చోటు చేసుకున్నది.
వర్మ మధ్యాహ్నం సుమారు 3 గంటలకు మంత్రిత్వశాఖ కార్యాలయంలోకి వెళుతూ కనిపించారు. విదేశాంగ శాఖ కార్యదర్శి జషిమ్ ఉద్దీన్‌తో ఆయన సమావేశం సుమారు 45 నిమిషాల సేపు జరిగింది. వారి మధ్య చర్చల గురించి మధ్యంతర ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటనా విడుదల చేయలేదు. కానీ హైకమిషనర్‌ను సమన్ చేసినట్లు అధికారులు ధ్రువీకరించారు.
అయితే, సమావేశం అనంతరం మీడియాతో వర్మ మాట్లాడుతూ, ఢాకా, న్యూఢిల్లీ మధ్య ‘భద్రత కోసం సరిహద్దులో కంచె వేసే విషయమై అవగాహనలు ఉన్నాయి’ అని తెలియజేశారు. ‘మా రెండు సరిహద్దు కాపలా సంస్థలు బిఎస్‌ఎఫ్, బిజిబి ఈ విషయమై ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటున్నాయి. ఈ అవగాహనను అమలు జరుపుతారని, సరిహద్దు పొడుగునా నేరాల కట్టడికి సహకారాత్మక దృక్పథం అనుసరిస్తారని ఆశిస్తున్నాం’ అని వర్మ తెలిపారు.
అంతకుముందు, హోం వ్యవహారాల సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) జహంగీర్ ఆలం చౌదరి మాట్లాడుతూ, సరిహద్దు గార్డ్ బంగ్లాదేశ్, స్థానికుల నుండి తీవ్ర వ్యతిరేకత కారణంగా భారతదేశం సరిహద్దు వెంబడి ముళ్ల తీగల కంచె నిర్మాణాన్ని నిలిపివేసిందని తెలిపారు. మీడియా సమావేశంలో చౌదరి మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో సంతకం చేసిన కొన్ని అసమాన ఒప్పందాల కారణంగా, “బంగ్లాదేశ్-భారత సరిహద్దు వెంబడి అనేక సమస్యలు తలెత్తాయి” అని చెప్పారు.
“అయితే, మన ప్రజలు, బిజిబి ప్రయత్నాలు ముళ్ల తీగల కంచెల నిర్మాణంతో సహా కొన్ని కార్యకలాపాలను భారతదేశం నిలిపివేయవలసి వచ్చింది. సరిహద్దు కార్యకలాపాలను నియంత్రించడానికి బంగ్లాదేశ్ , భారతదేశం నాలుగు అవగాహన ఒప్పందాలు కలిగి ఉన్నాయి” అని చౌదరి తెలిపారు.
“వీటిలో, 1975 అవగాహన ఒప్పందం జీరో లైన్ నుండి 150 గజాల లోపల రక్షణ సామర్థ్యంతో ఎటువంటి అభివృద్ధి జరగకూడదని పేర్కొంది. మరొక అవగాహన ఒప్పందం ప్రకారం పరస్పర సమ్మతి లేకుండా ఈ సరిహద్దులో ఎటువంటి అభివృద్ధి కార్యకలాపాలు జరగవు. అలాంటి ఏదైనా పనికి రెండు దేశాల మధ్య ముందస్తు ఒప్పందం అవసరం” అని ఆయన పేర్కొన్నారు.
బంగ్లాదేశ్‌తో ఉన్న 4,156 కిలోమీటర్ల పొడవైన సరిహద్దులో భారతదేశం ఇప్పటికే 3,271 కిలోమీటర్లు కంచె వేసిందని, దాదాపు 885 కిలోమీటర్లు కంచె లేకుండా వదిలివేసిందని సలహాదారుడు తెలిపారు.
More Stories
హసీనాను స్వదేశానికి రప్పించేందుకు విశ్వప్రయత్నాలు
వంద ఏళ్లైనా ఏఐతో ప్రోగ్రామర్లను భర్తీ చేయలేరు
భారత్ ను మినహాయించి 22 దేశాలపై ట్రంప్ సుంకాలను