పోర్న్‌ స్టార్‌ దోషిగా తేలిన ట్రంప్… కానీ శిక్ష లేదు

పోర్న్‌ స్టార్‌ దోషిగా తేలిన ట్రంప్… కానీ శిక్ష లేదు
అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌కు పోర్న్‌ స్టార్‌కు అక్రమంగా నగదు చెల్లించాడనే ఆరోపణల్లో  హష్‌మనీ కేసులో ‘షరతులు లేని డిశ్చార్జ్‌’ శిక్ష విధించారు. ఈ మేరకు న్యూయార్క్‌ కోర్టు జడ్జి జువాన్‌ ఎం మెర్చన్‌ శుక్రవారం కీలక తీర్పు వెలువరించారు. ట్రంప్‌కు అన్‌ కండిషనల్‌ డిశ్చార్జ్‌ విధిస్తున్నట్లు ప్రకటించారు. అంటే అతను నేరస్థుడే అని నిర్ధారణ అయినా కూడా జైలు కానీ, జరిమానా కానీ ఎదుర్కోనవసరం లేదు. 
 
దీంతో దోషిగా నిర్ధారణ అయిన తొలి అమెరికా అధ్యక్షునిగా ట్రంప్‌ అపఖ్యాతి మూటగట్టుకున్నారు. ఈ నెల 20న ట్రంప్‌ అమెరికా నూతన అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టనున్న సంగతి తెలిసిందే. కాగా తన న్యాయవాదితో కలిసి ట్రంప్‌ వర్చువల్‌గా కోర్టుకు హాజరయ్యారు. తాను నిర్దోషినని, ఏ తప్పు చేయలేదని న్యాయమూర్తి ముందు ట్రంప్‌ పేర్కొన్నారు. 
 
ఇటీవల ఎన్నికల్లో తనకు లక్షలాది ఓటుల వచ్చాయని, పాపులర్‌ ఓటులో తానే విజయం సాధించానని చెప్పారు. ఏడు స్వింగ్‌ రాష్ట్రాల్లోనూ విజయం సాధించానని గుర్తు చేశారు. ఈ కేసులో రాజకీయ కోణం ఉందని, తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఇలా చేశారని చెప్పుకొచ్చారు.  అంతకు ముందు న్యూయార్క్‌ న్యాయమూర్తి జారీ చేసిన ఆదేశాలను అడ్డుకోవాలంటూ ట్రంప్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఆయనకు అక్కడ ఎదురు దెబ్బ తగిలింది. హష్‌ మనీ కేసులో ట్రంప్‌ ఇప్పటికే దోషిగా తేలగా గత నవంబరులోనే న్యూయార్క్‌ కోర్టు శిక్ష ఖరారు చేయాల్సివుంది. 
 
కానీ, అదే సమయంలో అమెరికా నూతన అధ్యక్షుడిగా ట్రంప్‌ ఎన్నికయ్యారు. దీంతో తాను క్రిమినల్‌ విచారణ ఎదుర్కోకుండా రక్షణ ఉంటుందంటూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ ట్రంప్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు శిక్షను నిరవధికంగా వాయిదా వేసింది. 
చివరకు ఆయనకు ఇందులో రక్షణ కల్పించే అవకాశాలు లేవంటూ తేల్చిన న్యూయార్క్‌ కోర్టు జనవరి 10న శిక్ష విధిస్తానంటూ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే తాజా తీర్పు వెలువరించింది.