కెనడాలో ప్రస్తుత ప్రధాని జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించడంతో పాటు లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి కూడా ఆయన వైదొలుగుతున్నట్లు తెలిపారు. దీంతో కెనడా తదుపరి ప్రధాని ఎవరనేది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలోనే లిబరల్ పార్టీ ఓ కీలక ప్రకటన చేసింది. మార్చి 9న తమ పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకుంటామని ప్రకటించింది.
‘కొత్త నేతను పార్టీ ఎన్నుకున్న తర్వాత పార్టీ అధ్యక్ష పదవికి, ప్రధాని పదవికి కూడా రాజీనామా చేయాలని అనుకుంటున్నా’ అని సోమవారం మీడియా సమావేశంలో ట్రూడో తెలిపారు. కొత్త నేతను ఎన్నుకునేవరకు కెనడా పార్లమెంటును సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సస్పెన్షన్ మార్చి 24వ తేదీ వరకూ కొనసాగుతుందని వెల్లడించారు.
2015లో ప్రధానిగా పగ్గాలు చేపట్టిన ట్రూడోకు ఇటీవల సొంత పార్టీ ఎంపీల నుంచే వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కెనడాపై 25 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. అంతేకాక వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణాను నిరోధించలేకపోతే కెనడా 51వ రాష్ట్రంగా చేరాలంటూ హెచ్చరించారు.
దీంతో ట్రూడోపై ఒత్తిడి మరింత పెరిగింది. సొంత పార్టీ నేతలే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఆయన రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ట్రూడో స్థానంలో తదుపరి నాయకుడు ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రధాని రేసులో ఐదుగురి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ప్రధాన పోటీదారుగా భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ (57) ఉన్నారు. ప్రస్తుతం ఆమె కెనడా రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అనిత తల్లిదండ్రులు భారత్ నుంచి కెనడాకు వలస వెళ్లారు. కెనడాలోని నోవా స్కోటియాలో జన్మించిన అనిత పొలిటికల్ స్టడీస్, న్యాయవిద్యను పూర్తి చేసి టొరంటో యూనివర్సిటీలో విద్యా బోధన చేశారు.
ప్రధాని పదవికి ఆమె పేరును పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. భారత సంతతికి చెందిన మరో నేత, ఎంపీ చంద్ర ఆర్య కెనడా ప్రధాని పదవికి అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. “మన దేశాన్ని పునర్నిర్మించడం కోసం, భావి తరాలకు సౌభాగ్యాన్ని అందజేయడం కోసం చిన్న, మరింత సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడపటానికి నేను తదుపరి ప్రధాన మంత్రి పదవికి పోటీలో ఉన్నాను” అని ఎక్స్ పోస్ట్‌లో తెలిపారు.
వారిద్దరితో పాటు భారతీయ మూలాలు కలిగిన ఎంపీ జార్జ్ చాహల్, ఉప ప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్, ఆర్థికవేత్త మార్క్ కార్నే సైతం ఈ పదవికి పోటీ పడుతున్నారు.
More Stories
2025లో ప్రమాదంలో 47 కోట్ల మంది పిల్లల భవిష్యత్తు
40 ఏళ్ల తర్వాత ట్రంప్ ప్రమాణ స్వీకార వేదిక మార్పు
మరణం నుంచి తృటిలో తప్పించుకున్నాను