లొంగిపోయిన మావోలపై బిజెపి నేతల హెచ్చరిక

లొంగిపోయిన మావోలపై బిజెపి నేతల హెచ్చరిక
లొంగిపోయిన మావోయిస్టులను సమగ్రంగా విచారించాలని బీజేపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ సీటీ రవి డిమాండ్‌ చేశారు. మావోయిస్టులు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చారని చెబుతున్నారని, కానీ ఎన్నో ఏళ్లుగా వారు చట్టవ్యతిరేక కార్యకాపాలలో భాగస్వామ్యులయ్యారని గుర్తు చేశారు. మావోయిస్టులు చైనా సహకారంతోపాటు పాకిస్తాన్‌కు చెందిన ఐఎ్‌సఐ వంటి ఉగ్రవాద సంస్థల సహకారం ఇచ్చినట్లు గతంలో పలు సంఘటనలు రుజువయ్యాయని కూడా గుర్తు చేశారు.
 
లొంగిపోయినవారు మోసం చేసేందుకు వచ్చారో ఏమో తెలియదని పేర్కొంటూ తమ పోరాటం తప్పుగా భావించి లొంగిపోయి ఉంటే మంచిదే అని చెప్పారు. అయితే, వీరి పరివర్తన వెనుక ఎవరున్నారనేది బహిరంగం కావాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏ ఆలోచన లేకుండానే లొంగిపోయినవారిని విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
వీరు నిజమైన మావోయిస్టులు అయితే సమస్య లేదని తెలిపారు. అయితే, వారు ప్రజాప్రభుత్వ సిద్ధాంతాలను వ్యతిరేకించారని జాతీయత, రాజ్యాంగ వ్యతిరేక పాలసీలను పాటించారని, వారికి బుల్లెట్‌లపై ఉన్న నమ్మకం బ్యాలెట్‌లపై లేదనేది తెలిసిందే అని ఈ సందర్భంగా హెచ్చరించారు.  ఉన్నఫళంగా ఒకేసారి ఆరుగురు లొంగిపోవడం వెనుక ఉద్దేశం ఏమిటని ఆయన ప్రశ్నించారు. లబ్ధి పొందేందుకు వచ్చారా? ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయనేది కూడా విచారణలో తేల్చాలని రవి స్పష్టం చేశారు.
 
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్‌ ఎమ్మెల్యే సునిల్‌కుమార్‌ స్పందిస్తూ.. మావోయిస్టుల లొంగుబాటుపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మావోయిస్టుల నియంత్రణ దళానికి లభించని నక్సల్స్‌ ఆచూకీ సీఎంకు ఎలా సాధ్యమైందని ఆయన సందేహం వ్యక్తం చేశారు. మావోయిస్టులు చట్టం ముందు లొంగిపోవడం మంచిదే అని పేర్కొంటూ వారు శాంతికోసం జనజీవనస్రవంతిలోకి ప్రజాసంఘాల నేతల ద్వారా సీఎం సమక్షంలో లొంగిపోవడం అనుమానాలకు కారణమవుతోందని ఆయన తెలిపారు.
చట్టప్రక్రియకు ముందే ఏ, బీ, సీ అంటూ వర్గీకరణ చేసి ప్యాకేజి ఎలా ప్రకటిస్తారని ఆయన ప్రశ్నించారు. సీఎం పిలుపుతో వారంలోనే లొంగిపోయే ప్రక్రియ ఆశ్చర్యం కలిగిస్తోందని అంటూ విస్మయం వ్యక్తం చేశారు. తద్వారా రాత్రింబవళ్లు తేడా లేకుండా అడవుల్లో కూంబింగ్‌ చేస్తూ ప్రజలను రక్షించాలనే లక్ష్యం కలిగిన మావోయిస్టులు నియంత్రణ దళం నైతిక స్థైర్యం కోల్పోయినట్లు కాదా? అని ప్రశ్నించారు. 

బీజేపీ ఎమ్మెల్సీ రవికుమార్‌ బెంగళూరులో మాట్లాడుతూ మావోయిస్టులను ఆడంబరంగా తీసుకొచ్చి సీఎం సమక్షంలో లొంగిపోయినట్లు చూపడం ఎంతవరకు సరి అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. వారు చిక్కమగళూరు జిల్లా అధికారి ఎదుట లొంగిపోవాలని భావిస్తే కాదు కూడదని భారీ కాన్వాయ్‌ రూపంలో బెంగళూరుకు తీసుకొచ్చి సీఎం అధికారిక నివాసం వద్ద ఎలా లొంగిపోతారని అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

 ఉపముఖ్యమంత్రి, హోం మంత్రుల సమక్షంలో లొంగిపోవడాన్ని ఏమని అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. కాగా, సీఎం సమక్షంలో మావోయిస్టులు లొంగిపోవడాన్ని ప్రశ్నించే బీజేపీ నేతలు హోం మంత్రి అమిత్‌షా సమక్షంలో లొంగిపోవడాన్ని ఎందుకు వ్యతిరేకించరని కాంగ్రెస్‌ ఎక్స్‌ ద్వారా ప్రశ్నించింది.