దేశంలో అనేక మందిరం-మసీదు వివాదాలు తిరిగి తలెత్తిన సమయంలో “వారసత్వాన్ని తిరిగి పొందడం చెడు విషయం కాదు” అని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. మహాకుంభ మేళా ప్రారంభం ముందు ధర్మ సంసద్ కార్యక్రమంలో పాల్గొంటూ మతపరమైన కార్యక్రమం జరుగుతున్న ప్రాంతం వక్ఫ్ ఆస్తి అని చెప్పిన వాదనలను కూడా ఆయన ఖండించారు.
“వారసత్వాన్ని తిరిగి పొందడం అనేది తప్పు కాదు. సనాతన ధర్మం ఇప్పుడు ప్రజల్లో చూడవచ్చు. వివాదాస్పద నిర్మాణాలను మసీదులు అని పిలవకూడదు. ముస్లిం లీగ్ మనస్తత్వం భారత్ ను ముందుకు పోవడాన్ని అంగీకరించలేదు” అని ఆదిత్యనాథ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్ లోని షాహీ జామా మసీదు వివాదం, గత సంవత్సరం జరిగిన హింసను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
షాహి జామా మసీదు విషయంలో కోర్టు ఆదేశాలపై సంభాల్లో జరిగిన హింసను ఆదిత్యనాథ్ ప్రస్తావించారు. పురాణాల ప్రకారం, విష్ణువు పదవ అవతారమైన కల్కి జన్మస్థలం సంభాలుగా పేర్కొనబడిందని ఆయన చెప్పారు. ఈ హింసలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా గాయపడ్డారు. 1596లో సంభాల్లో హరిహర ఆలయాన్ని కూల్చివేసి, అక్కడ మసీదు నిర్మించారు. ఈ విషయాన్ని ‘అయన్-ఇ-అక్బరీ’ పుస్తకంలో కూడా ప్రస్తావించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
గంగానదీ పరిశుభ్రతపై సమాజ్వాదీ పార్టీ చేసిన ఆరోపణలను కూడా తిప్పికొడుతూ 2013లో మారిషస్ ప్రధాని గంగానదిలో పవిత్ర స్నానం చేయడానికి భారత్ వచ్చినప్పుడు, కుంభ మేళా కాలుష్యం, మురికి, దుర్వినియోగం కారణంగా స్నానం చేయకుండా తిరిగి వెళ్లారని ఆదిత్యనాథ్ గుర్తు చేశారు. ఆ సమయంలో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
ఇప్పుడు డబుల్ ఇంజిన్ ప్రభుత్వ కృషి ద్వారా గంగానది పరిశుభ్రంగా మారిందని ఆయన చెప్పారు. “2019లో మారిషస్ ప్రధాని వారణాసిని సందర్శించి, అక్కడ కుంభ మేళా జరిగే ప్రాంతం చూస్తూ పవిత్ర స్నానం చేశారు” అని తెలిపారు. ప్రయాగ్రాజ్ లో మహాకుంభ మేళా వక్ఫ్ భూమిలో జరుగుతున్నట్లు కొందరు మతాధికారులు పేర్కొన్న నేపథ్యంలో, ఆదిత్యనాథ్ వక్ఫ్ బోర్డుపై కూడా విమర్శలు చేశారు. వక్ఫ్ పేరుతో భూమి ఆక్రమించిన ప్రతి అంగుళం భూమిని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
“మహాకుంభ మేళా ఎప్పుడూ భారతదేశ వారసత్వంగా నిలుస్తుంది. ఇది వక్ఫ్ బోర్డు కాదు. భూమి మాఫియా బోర్డు” అని ఆయన విమర్శలు గుప్పించారు. ఈ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు. “వక్ఫ్ అని ఎక్కడా కనిపించినా, ఆ భూమి మొదట ఎవరి పేరిట ఉంది అనే దర్యాప్తు జరుగుతుంది” అని ఆదిత్యనాథ్ ప్రకటించారు.
More Stories
మంత్రులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు
భార్యతో సెల్ఫీతోనే మావోయిస్టు చలపతి హతం!
పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు