*రూ. 4.89 లక్షల కోట్ల నష్టం, 2000 విలాస భవనాల బూడిదమయం
అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో కార్చిచ్చు ఆగడం లేదు. వరుసగా రెండో రాత్రి కూడా అక్కడి అడవులు అంటుకున్నాయి. దీంతో తీవ్ర నష్టం జరిగింది. అయిదు ప్రదేశాల్లో దావానలం చెలరేగుతున్నట్లు అధికారులు చెప్పారు. అయితే ఈ కార్చిచ్చు వల్ల అయిదుగురు మృతిచెందారు. అయిదు చోట్ల మంటల వల్ల సుమారు 27 వేల ఎకరాల అడవి దగ్ధం అవుతున్నది. లాస్ ఏంజెల్స్‌ను కబళించిన భారీ కార్చిచ్చు ఆ దేశానికి భారీ నష్టాన్ని మిగిల్చింది.
ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా మరణాల సంఖ్య ఐదే ఉన్నప్పటికీ భారీగా ఆస్తి నష్టం సంభవించింది. 2 వేలకు పైగా విలాసవంతమైన భవనాలు బూడిదయ్యాయి. కాలిఫోర్నియాకు మునుపెన్నడూ లేనంతగా ప్రకృతి వైపరీత్యం కారణంగా 4.89 లక్షల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్టు ఆక్యూవెదర్.ఐఎన్‌సీ ప్రకటించింది. అంతేకాకుండా ఈ విపత్తు వల్ల ఏర్పడిన పొగ, ఇతర విష వాయువుల కారణంగా పౌరులకు భవిష్యత్‌లో అనారోగ్య సమస్యలు ఏర్పడటంతో పాటు ఈ ప్రాంత పర్యాటకంపై ప్రభావం పడుతుందని తెలిపింది.
పాలిసేడ్స్, ఈటాన్ వద్ద భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ రెండు చోట్ల మంటల్ని ఆర్పడం ఇబ్బందిగా మారింది. శాన్ ఫెర్నాండో వ్యాలీలో మాత్రం కార్చిచ్చును అదుపు చేయడంలో అగ్నిమాపక సిబ్బంది సక్సెస్ అయ్యింది. ఈటాన్ సిటీలో అయిదుగురు మృతిచెందారు. నగరం నుంచి సుమారు 1.37 వేల మంది ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
రునియన్ కానియన్ వద్ద దావానలం వ్యాపించడంతో.. హాలీవుడ్ కొండల్లోని వీధులన్నీ రద్దీగా మారాయి. జనం భయంతో పరుగులు తీస్తున్నారు. అనేక మంది హాలీవుడ్ సెలబ్రిటీల ఇండ్లు కూడా దగ్ధం అయ్యాయి. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ ప్రాంతానికి కిలో మీటరు దూరంలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో గ్రామన్స్ చైనీస్ థియేటర్, మేడమ్ టుస్సాడ్స్ చట్టుముట్టు ఉన్న వీధుల్లో సైరన్ మోతలతో ట్రాఫిక్ కిక్కిరిసిపోయింది.
మంటలపై నీళ్లు పోయడానికి తక్కువ ఎత్తులో ఎగురుతున్న హెలికాప్టర్ల భారీ శబ్ధాలతో అక్కడ పరిస్థితి గందరగోళంగా తయారైంది. ప్రజలు సూట్కేసులు పట్టుకుని హోటళ్లు, నివాసాల నుంచి బయటకు వచ్చే కాలినడకన సురక్షిత ప్రాంతాలకు బయలుదేరారు. కొంతమంది మంటల వైపు వెళ్లి ఆ దృశ్యాలను తమ ఫోన్లలో బంధించారు.
1000 కంటే ఎక్కువ నిర్మాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. అందులో ఎక్కువగా ఇళ్లు ఉన్నాయి. లాస్ఎంజెలెస్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో 1.3 లక్షల మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. బుధవారం గాలుల తీవ్రత కాస్త తగ్గినా పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు.
పక్కరాష్ట్రాల నుంచి వచ్చిన వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. అయితే నాలుగు చోట్ల భారీగా మంటలు చెలరేగుతున్నాయి. లాస్ ఏంజెలెస్లో పాలిసాడ్స్ చార్టర్ హై స్కూల్ సహా అరడజనుకు పైగా పాఠశాలలు కార్చిచ్చు ధాటికి దగ్ధమయ్యాయి. 1976లో వచ్చిన హార్రర్ సినిమా క్యారీతో పాటు అనేక సినిమాల్లో ఈ పాఠశాల కనిపించిందని అధికారులు తెలిపారు.
కాలిఫోర్నియా భారీ విపత్తు చోటుచేసుకున్నట్లు అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. ఫెడరల్ నిధుల్ని రిలీజ్ చేసే యోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం కాచిన లేదా బాటిల్ నీళ్లను మాత్రమే సేవించాలని పసిఫిక్ పాలిసేడ్స్ ప్రాంత ప్రజలకు అధికారులు సూచన చేశారు. నీటి కొరత ఏర్పడడంతో… స్విమ్మింగ్ పూల్స్, చెరువల నుంచి నీటి తోడి మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటల్లో నటి పారిస్ హిల్టన్ ప్రాపర్టీ దగ్దమైంది.
కార్చిచ్చు గురించి తెలుసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గవర్నర్ గవిన్ న్యూసమ్తో భేటీ అయ్యారు. శాంటా మోనికా అగ్నిమాపక కేంద్రానికి చేరుకున్న బైడెన్, వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫెడరల్ ఎమర్జెన్సీ ప్రకటనపై సంతకం చేశారు. అంతేకాకుండా సహాయక చర్యలు మరింత ముమ్మరం చేయడానికి నేషనల్ గార్డ్ దళాలను పంపించారు.
అయితే, లాస్ ఏంజెలెస్‌లో అగ్నికీలలను అదుపు చేయడంలో విఫలమైన కాలిఫోర్నియా గవర్నర్ గవిన్‌న్యూసమ్ రాజీనామా చేయాలని కాబోయే అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి వాటర్ మేనేజ్‌మెంట్‌లో జరిగిన లోపాలను ఈ అగ్ని ప్రమాదాలు తెలియజేస్తున్నాయన్నారు.
లాస్ ఏంజిల్స్ డౌన్‌టౌన్‌కు పశ్చిమాన ఉన్న పసిఫిక్ తీరంలోని నివాస ప్రాంతాలను కార్చిచ్చు నేలమట్టం చేసింది. పసిఫిక్ పాలిసాడ్స్లోని గ్రాసరీ స్టోర్స్, బ్యాంకులను శిథిలాలుగా మార్చింది. కొండలతో ఉన్న ఈ ప్రాంతంలో సెలెబ్రెటీలు ఎక్కువగా నివాసం ఉంటారు. లాస్ ఏంజెలెస్ అధునిక చరిత్రలో ఇది అత్యంత విధ్వంసకరమైన అగ్నిప్రమాదంగా ఎల్ఏ కౌంటీ అగ్నిమాపక చీఫ్ ఆంథోనీ మర్రోన్ పేర్కొన్నారు.
ఇక్కడ కాలిఫోర్నియా మిషన్ స్టైల్లో నిర్మించిన ఇళ్లను కార్చిచ్చు ఒక బ్లాక్ తర్వాత మరో బ్లాక్కు విస్తరించి పూర్తిగా శిథిలాలుగా మార్చింది. స్విమ్మింగ్ పూల్స్ నల్లగా మారిపోయి. కాలిపోయిన ఇళ్ల అవశేషాలు, నల్లగా మారిన పంపు, గేట్లు, కరిగిన టైర్లపై స్పోర్ట్స్ కార్డు పడిపోయినట్లు- అక్కడ కిలోమీటర్ల మేర ఇదే దృశ్యం కనిపిస్తుంది.
More Stories
మంత్రులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు
భార్యతో సెల్ఫీతోనే మావోయిస్టు చలపతి హతం!
పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు