సెప్టెంబర్, 2026 నుంచి విశాఖ విమానాశ్రయం మూత

సెప్టెంబర్, 2026 నుంచి విశాఖ విమానాశ్రయం మూత
విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం 2026 సెప్టెంబర్ నుంచి మూతపడనున్నది. ప్రయాణికుల విమానాలను అనుమతించరు. దీనిని పూర్తిగా తూర్పు నౌకాదళమే రక్షణ అవసరాలకు ఉపయోగించుకుంటుంది. విశాఖ విమానాశ్రయం సలహా కమిటీ సోమవారం ఎంపీ ఎం.శ్రీభరత్‌ అధ్యక్షతన సమావేశమైంది. 

ఈ సందర్భంగా భోగాపురంలో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం 2026 జూన్‌లో ప్రారంభమైతే విశాఖ విమానాశ్రయం పరిస్థితి ఏమిటని పలువురు సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. దానిపై విశాఖ నేవీ వైమానిక స్థావరం వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న ఐఎన్‌ఎస్‌ డేగా అధికారులు, విమానాశ్రయం డైరెక్టర్‌ రాజారెడ్డి అనుకున్న సమయానికి భోగాపురం ప్రారంభమైతే అదే ఏడాది సెప్టెంబరు నుంచి విశాఖ విమానాశ్రయం మూసేస్తామని స్పష్టంచేశారు. 

విశాఖ విమానాశ్రయాన్ని నేవీ ఉపయోగించుకుంటున్న సంగతి తెలిసిందే. భవిష్యత్తు అవసరాల కోసం ప్రస్తుతం 10 వేల అడుగుల పొడవు ఉన్న రన్‌వేను నేవీ అధికారులు అటు వేయి అడుగులు, ఇటు 1,000 అడుగుల పొడవు పెంచే పనిలో ఉన్నారు. ఇవి ఆగస్టుకు కాని పూర్తికావని చెబుతున్నారు. 

ఈ పనులు జరుగుతున్నపుడు విమానాలు దిగడం కోసం ఉపయోగించే ‘ఇనుస్ట్రుమెంట్‌ ల్యాండింగ్‌ సిస్టమ్‌(ఐఎల్‌ఎస్‌)’ను ఆపేస్తున్నారు. గత కొద్దికాలంగా రన్‌వే విస్తరణ పనులు జరుగుతుండడం వల్ల విమానాలతో ఐఎల్‌ఎస్‌ అనుసంధాన ప్రక్రియకు సాంకేతిక అవరోధాలు కలుగుతున్నాయి. రన్‌వే పనులు పూర్తయ్యేంత వరకు ఐఎల్‌ఎస్‌ సదుపాయం ఉండదని కూడా నేవీ అధికారులు ఈ సమావేశంలో స్పష్టం చేశారు. 

అదే విధంగా రన్‌వే పనులు త్వరితంగా పూర్తిచేయడానికి ఫిబ్రవరి నుంచి రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు విమానాల రాకపోకలను అనుమతించబోమని నేవీ అధికారులు వెల్లడించారు.  విశాఖ విమానాశ్రయానికి అంతర్జాతీయ సర్వీసులు సింగపూర్‌, బ్యాంకాక్‌, కౌలాలంపూర్‌ నుంచి రాత్రి 11 గంటల తరువాతే వస్తున్నాయి. అవి రద్దు కాకుండా ఉండాలంటే వాటి షెడ్యూళ్లు మార్చుకోవాలని, లేదంటే రాత్రి 12 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు రాకపోకలు నిలిపివేస్తామని నేవీ అధికారులు పేర్కొన్నారు.

విశాఖ విమానాశ్రయంలో రన్‌వేను ప్రస్తుతం అటు పౌర విమానాలకు, అటు నేవీ విమానాలకు ఉపయోగిస్తున్నారు. పౌర విమానాలకు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు గంటకు 12 స్లాట్లు మాత్రమే ఇస్తున్నారు. అంటే ఆరు విమానాలు వచ్చి, తిరిగి వెళ్లగలుగుతున్నాయి. దీనివల్ల కొత్త విమానాలు రావడానికి అవకాశం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో విశాఖ ఎంపీ శ్రీభరత్‌ స్లాట్ల సంఖ్యను 18కి పెంచాలని నేవీ అధికారులను కోరారు. అన్ని ఇవ్వలేమని 15 వరకూ మాత్రమే ఇస్తామని హామీ ఇచ్చారు.