తెలంగాణ బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి

తెలంగాణ బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి
ఎంపీ ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేష్ బిధూరీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్‌లోని బీజేపీ తెలంగాణ కార్యాలయంపై మంగళవారం కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. బీజేపీ ఆఫీస్‌పై కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలపై బీజేపీ నాయకులు ఎదురుతిరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల కార్యకర్తలు కర్రలతో కొట్టుకున్నారు. 
 
యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్‌ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు చేసిన యత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు. ఈ దాడిలో గాయపడిన బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లును ఆసుపత్రికి తరలించారు.
 
గాంధీ భవన్‌ నుంచి ర్యాలీగా బీజేపీ కార్యాలయం వరకు వెళ్లి ముట్టడించాలని యువజన కాంగ్రెస్‌ భావించింది. దీంతో పోలీసులు పెద్ద సంఖ్యలో గాంధీ భవన్‌ వద్ద మెహరించారు. గాంధీ భవన్‌ వద్దకు వస్తే బయటకు పోనీకుండా పోలీసులు అడ్డుకుంటారని భావించి కొందరు యువజన కాంగ్రెస్‌ నాయకులు నేరుగా నాంపల్లిలోని బీజేపీ కార్యాలయ ముట్టడికి వచ్చారు. 
 
అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు ఎదురు దాడి చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపైకి రాళ్లు విసిరారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. కార్యాలయంపై రాళ్లు విసరడంతో ఒక బీజేపీ కార్యకర్త తలకు గాయమైంది. బీజేపీ శ్రేణులు కర్రలతో కాంగ్రెస్‌ కార్యకర్తల వెంటపడ్డారు. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. 
 
ప్రియాంక గాంధీపై రమేష్‌ బిదూరి చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు.  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రమేశ్‌ బిధూరి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.  ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జరిగిన ఒక సభలో ఆయన మాట్లాడుతూ తాను గెలిస్తే నియోజకవర్గంలోని రోడ్లను కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ చెంపలంతా నునుపుగా మారుస్తానని చెప్పారు. దీనిపై దుమారం చెలరేగడంతో బిధూరీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు.

మరోవంక, బీజేపీ కార్యాలయంపై ఉదయం కాంగ్రెస్ కార్యకర్తల దాడి నేపథ్యంలో మధ్యాహ్నం గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ యువ మోర్చా బయలుదేరింది. ఈ ముట్టడిపై ముందుగానే సమాచారం ఉన్న అధికారులు ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. బీజేపీ కార్యకర్తలు బయటకు రాకుండా ఆ మార్గంలో దారులను మూసివేశారు.

 వేరేమార్గాల నుంచి దాడికి వస్తున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. మరోవైపు కొందరు కార్యకర్తలు గాంధీభవన్‌ వద్దకు చేరుకొని కాంగ్రెస్‌ నాయకుల ఫ్లెక్సీలు చించేశారు.  పోలీసులు తమను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ యువమోర్చా కార్యకర్తలు ముందుకు కదిలారు. పోలీసులు వీరిని ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. ఈ ఘర్షణ నేపథ్యంలో నాంపల్లి మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.