ఆలయాల స్వయం ప్రతిపత్తికై నేడే హైందవ శంఖారావం

ఆలయాల స్వయం ప్రతిపత్తికై నేడే హైందవ శంఖారావం
హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే డిమాండ్ తో దేశవ్యాప్తంగా చేపట్టిన ఉద్యమంలో భాగంగా మొదటగా విజయవాడ సమీపంలోని కేసరపల్లి వద్ద విశ్వహిందూ పరిషత్ ఆదివారం హైందవ శంఖారావం పూరించబోతుంది. హిందూ ఆలయాలు ప్రభుత్వాల చేతిలో పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని ఆరోపిస్తూ భక్తులే స్వయం ప్రతిపత్తితో నిర్వహించాలనే డిమాండ్తో ఈ హైందవ శంఖారావ సభలు జరగనున్నాయి.
 
విశ్వహిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) ‘హైందవ శంఖారావం’ పేరుతో హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించడమే అజెండాగా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ సభ జరగనుంది. ఈ సభలో దేశభక్తి, దైవభక్తి, సేవాభావం ఉన్న ప్రముఖులు హిందూ సమాజం ఆకాంక్షలపై మాట్లాడతారని వీహెచ్‌పీ రాష్ట్రశాఖ తెలిపింది. 
 

సాధువులు, మఠాధిపతులు సహా 4 లక్షల మంది పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. వీహెచ్‌పీ జాతీయ అధ్యక్షుడు అలోక్‌ కుమార్‌, ముఖ్యులు మిలింద్‌ పరాండే, కోటేశ్వర శర్మ, రామ జన్మభూమి తీర్థ క్షేత్ర కోశాధికారి గోవింద దేవ్‌ గిరి మహరాజ్‌ హాజరవుతున్నారని వెల్లడించారు. గన్నవరం విమానాశ్రయానికి చేరువలో 30 ఎకరాల్లో ఈ సభ, పార్కింగ్ కు ఏర్పాట్లు చేశారు. బస్సులు, రైళ్లల్లో భారీగా ప్రజలు తరలి వస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక బస్సులు, రైళ్లు, సొంత వాహనాలపై లక్షల మంది హిందువులను ఈ సభలో పాల్గొనేలా జనసమీకరణ చేస్తున్నామని చెప్పారు. పొరుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాది నుంచి హిందువులు హాజరు కానున్నట్టు చెప్పారు. సభకు 3,300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  తొమ్మిది రైళ్లతో పాటు రెండు వేల బస్సులు, భారీగా కార్లు ఇతర వాహనాలు వస్తున్నందున బందోబస్తుతో పాటు ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్‌ మళ్లింపు చేపట్టినట్లు ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్‌ కుమార్‌ తెలిపారు.

ప్రభుత్వాల ద్వారా హిందూ దేవాలయాల నిర్వహణ చేయడం అనేది రాజ్యాంగంలోని 12, 25, 26 ఆర్టికల్స్‌ ప్రకారం రాజ్యాంగ ఉల్లంఘనే కాకుండా హిందూ విశ్వాసాలపై తీవ్రమైన దాడి అవుతుందని స్పష్టం చేస్తున్నారు. ఆలయాల నిర్వహణ, ఆస్తుల విషయాల్లో ప్రభుత్వాలు దూరంగా ఉండాలని న్యాయస్థానాలు స్పష్టమైన తీర్పులు ఇచ్చాయని తెలిపారు. 

కొన్ని రాజకీయ పార్టీలు సెక్యులర్‌ ముసుగులో హిందూ సంప్రదాయాలను నాశనం చేయాలనే సంకల్పంతో ఆలయాలను తమ గుప్పెట్లో పెట్టుకుని దేవాలయ వ్యవస్థకు నష్టం కలిగించాయని ఆరోపించారు. ఆలయాలను స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ఉత్తమ ధార్మిక వ్యవస్థకు అప్పగిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలని విశ్వహిందూ పరిషత్ జాతీయ ఉద్యమానికి విజయవాడ నుండే శ్రీకారం చుట్టింది. 

కన్యాకుమారి నుంచి‌ కాశ్మీర్ వరకు ఉన్న ఆలయాల‌ కోసం ఈ‌ పోరాటం చేస్తున్నామని, గతంలో విశ్వహిందూ పరిషత్తు ఎన్నో పోరాటాలు చేసినా ఈ శంఖారావం వాటికి భిన్నం అని తెలిపారు. శంఖారావం కార్యక్రమానికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని, అన్ని రాజకీయ పక్షాలకు ఆహ్వానం పలికామని పేర్కొన్నారు.

భారీగా జనం వస్తారనే అంచనాతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 500 సీసీ కెమెరాల నిఘాతోపాటు గన్నవరం విమానాశ్రయం పరిసరాల్లో డ్రోన్ల వినియోగంపై ఆంక్షలు ఉన్నప్పటికీ పరిమిత ఎత్తులో డ్రోన్ల ద్వారా కూడా నిఘాకు ఒక్కరోజే అనుమతి తీసుకున్నట్లు ఐజీ అశోక్‌కుమార్‌ తెలిపారు.