‘తెలుగు‘లో ఇంజనీరింగ్‌, మెడిసిన్ కోర్సులను బోధించాలి

‘తెలుగు‘లో ఇంజనీరింగ్‌, మెడిసిన్ కోర్సులను బోధించాలి
తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ తదితర కోర్సులను పూర్తిగా తెలుగు మాధ్యమంలో బోధించేందుకు పెద్ద ఎత్తున కృషి జరగాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అభిలషించారు. శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించిన పదకోశాలు తెలుగులో మరిన్ని రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆంగ్లం మోజులో పడి తెలుగును నిర్లక్ష్యం చేయడం భావ్యం కాదని స్పష్టం చేశారు.
 
ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల సందర్భంగా శనివారం హైటెక్స్‌లోని నోవొటెల్‌ హోటల్‌ వేదికగా సాగుతున్న రెండో రోజు సమావేశంలో పాల్గొంటూ
తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత మనంందరిపై ఉందని, ఆ ఉద్యమం మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని  పిలుపునిచ్చారు.
 
భారతదేశంలోని ప్రాచీన భాషల్లో తెలుగు ఒక్కటి. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, ఒడియా, సంస్కృతం ప్రాచీన భాషలుగా కేంద్ర ప్రభుత్వం  గుర్తించాయని చెప్పారు. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని ఊరికే అనలేదని అంటూ తెలుగు భాష ప్రపంచంలోనే అత్యంత అందమైన భాష, తెలుగు పదాలు, శ్రావ్యంగా వినేవారికి సంగీతాన్ని విన్నట్టు అనిపిస్తుందని తెలిపారు.
 
 ప్రస్తుతం చాలామంది తెలుగును నిర్లక్ష్యం చేస్తున్నారని,  తెలుగు మాతృభాష అయి ఉండి తెలుగులో రాయలేకపోతున్నారని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కానీ, లెటర్లు కానీ.. తెలుగు పదాలను కూడా ఇంగ్లీషులో రాస్తున్నారని అంటూ ఆయన విచారం వ్యక్తం చేశారు.  ఇంట్లో కూడా మనం మాట్లాడే భాషలో 30 శాతం మాత్రమే తెలుగులో మాట్లాడుతున్నామని తెలిపారు.
 
తెలుగు మీడియంలో చదివితే ఉద్యోగాలు రావన్న అపోహను వీడాలని చెప్పారు. చైనా, జపాన్‌, దక్షిణ కొరియా తదితర దేశాల్లో ఆయా దేశాల మాతృభాషలోనే విద్య, పరిపాలన సంబంధిత వ్యవహారాలను కొనసాగిస్తూనే అభివృద్ధి చెందాయని గుర్తు చేశారు.

నిజాం కాలంలో తెలుగు భాషపై అణచివేత కొనసాగిందని, ఉర్దూ మీడియం స్కూల్సే ఉండేవని, తెలుగు వాళ్లు అక్కడే చదువుకోవాల్సి వచ్చేదని ఆయన గుర్తు చేశారు. అయితే,  అంత నిర్బంధంలో కూడా నాడు గ్రంథాలయోద్యమం, ‘ఆంధ్ర మహాసభ’ పేరిట తెలుగు భాషను పరిరక్షించుకునేందుకు అనేక పోరాటాలు సాగాయని కిషన్ రెడ్డి తెలిపారు. 
 
ఇక, యక్షగానం, భాగవతం, నాటకం వంటివి తెలుగు భాషకే ప్రత్యేకమైన కళా రూపాలు అని పేర్కొంటూ ప్రపంచంలో అవధానం అనేది తెలుగు, సంస్కృతంలో తప్పిస్తే మరే భాషలోనూ కనపడదని స్పష్టం చేశారు.
 
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు తెలుగు అధికార భాషగా కొనసాగించడంపై మరింత శ్రద్ధ పెట్టాలని కిషన్‌ రెడ్డి సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో కొనసాగేలా చొరవ చూపాలని కోరారు. న్యాయస్థానాల్లో వాదోపవాదాలు, తీర్పులు సైతం మాతృభాషల్లో వెలువరించాలన్న సంకల్పానికి కేంద్రం పూర్తి మద్దతు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. 
 
నూతన జాతీయ విద్యా విధానం ద్వారా మోదీ ప్రభుత్వం మాతృభాషలకు పెద్దపీట వేసిందని, భారతీయ భాషల్లో ఉన్నత విద్య పాఠ్య ప్రణాళికలను, పాఠ్యపుస్తకాలను రూపొందించేందుకు కృషి చేస్తున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు.