నీట్‌- యుజి పరీక్షపై నిపుణుల సిఫార్సులు అమలు

నీట్‌- యుజి పరీక్షపై నిపుణుల సిఫార్సులు అమలు
గతేడాది నీట్‌- యుజి నిర్వహణలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ పనితీరును సమీక్షించిన తర్వాత పరీక్షల సంస్కరణలపై ఏడుగురు సభ్యుల నిపుణుల మండలి సూచించిన దిద్దుబాటు చర్యలన్నింటినీ అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. వివాదాలతో కూడిన నీట్‌ – యుజి 2024 పరీక్షను రద్దు చేయడానికి సుప్రీంకోర్టు గత ఏడాది ఆగస్టు 2న తిరస్కరించింది. 
 
పరీక్షల సమగ్రతపై రాజీ పడేలా అవకతవకలు జరిగాయని లేదా వ్యవస్థాగతంగా లీకేజీ జరిగిందని చెప్పేందుకు తగిన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంది. నీట్‌- యుజి పరీక్ష పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా జరిగేలా చూసేందుకు అవసరమైన సంస్కరణలు సిఫార్సు చేయాలంటూ ఇస్రో మాజీ చీఫ్‌ రాధాకృష్ణన్‌ నేతృత్వాన ఏడుగురు సభ్యులతో కమిటీని నియమించింది. 
 
కేంద్రం నియమించిన కమిటీ తన నివేదికను ఇచ్చిందని, ఆ సిఫార్సులన్నింటినీ ప్రభుత్వం అమలు చేస్తుందని గురువారం సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సుప్రీం బెంచ్‌కు తెలియజేశారు. సిఫార్సులన్నింటినీ అమలు చేయబోతున్నందున ఆరు మాసాల తర్వాత విచారణ జరపాలని కోరారు. దానిపై బెంచ్‌ స్పందిస్తూ మూడు మాసాల పాటు వాయిదా వేస్తున్నామని, ఏప్రిల్‌ మాసంలో ఈ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను విచారణ జరుపుతామని బెంచ్‌ పేర్కొంది. ప్రశ్నల ముద్రణ వంటి అంశాలకు సంబంధించిన కొన్ని వివరాలు వున్నందున మొత్తం నివేదిక అంతా రికార్డుల్లో పెట్టలేదు.