ఢిల్లీలో మంచుదుప్ప‌టి.. 200కుపైగా విమానాలు ఆల‌స్యం

ఢిల్లీలో మంచుదుప్ప‌టి.. 200కుపైగా విమానాలు ఆల‌స్యం
ఉత్తర భారతదేశంలోని వివిధ ప్రాంతాలను దట్టపొగమంచు కమ్మేసింది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోయాయి. విజిబిలిటీ (దృశ్యమాన్యత) సున్నాకి తగ్గడంతో రైలు, విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. 200 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రకటించింది.

 ప్ర‌తి రోజు ఇందిరా గాంధీ విమానాశ్ర‌యంలో దాదాపు 1300 విమానాల‌ను ఆప‌రేట్ చేస్తుంటారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో శుక్రవారం ఉదయం విజిబిలిటీ 50 మీటర్లకు తగ్గిపోయింది. రన్‌వే విజిబిలిటీ ఉదయం 7 గంటల సమయంలో జీరోకు పడిపోయింది. దీంతో స్పైస్‌జెట్‌, ఇండిగో, ఎయిర్‌ ఇండియా సహా ఢిల్లీకి రాకపోకలు సాగించే పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

ఢిల్లీ, లక్నో, బెంగళూరు, అమృతసర్‌, గౌహతి మీదుగా దట్టమైన పొగమంచు కొనసాగుతోందని, దీంతో పలు విమానాలు ప్రభావితమైనట్లు స్పైస్‌జెట్‌, ఇండిగో, ఎయిర్‌ ఇండియా ప్రకటించాయి. ఢిల్లీ నుండి వెళ్లే సుమారు 24 రైళ్లు ఆలస్యమైనట్లు రైల్వే శాఖ ప్రకటించింది. అయోధ్య ఎక్స్‌ప్రెస్‌, గోరఖ్‌ధామ్‌, బీహార్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌, శ్రమశక్తి ఎక్స్‌ప్రెస్‌లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

భారత వాతావరణ శాఖ (ఐఎండి) విడుదల చేసిన 24 గంటల నివేదిక ప్రకారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్‌ కాగా సాధారణం కంటే మూడు డిగ్రీలు తక్కువగా ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత 7.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. వారం రోజుల పాటు ఇదే వాతావరణం ఉంటుందని ఐఎండి అంచనా వేసింది. శుక్రవారం ఉదయం ఢిల్లీలో ఉష్ణోగ్రత 9.6 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది.

ఢిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరాదిన పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. ఢిల్లీలో కనిష్టంగా 7.6 డిగ్రీల సెల్సియస్‌ నమోదు కాగా.. గరిష్టంగా 16 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత రికార్డయ్యింది. ఢిల్లీలో జనవరి 8 వరకు పొగమంచు కమ్ముకునే అవకాశం ఉందని, జనవరి 6న తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.