కర్ణాటకలో 15% పెరిగిన బస్ ఛార్జీలు

కర్ణాటకలో 15% పెరిగిన బస్ ఛార్జీలు
* ఉచిత ప్రయాణాలతో తెలుగు రాస్త్రాలలో కూడా తప్పదా!

బస్సు టికెట్ ఛార్జీలను 15 శాతం పెంచుతూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర కేబినెట్ ఛార్జీల పెంపునకు ఆమోదం తెలిపింది. ఇంధన ధరలు, సిబ్బందిపై వ్యయం వంటి నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్‌కే  పాటిల్ తెలిపారు.

ప్రభుత్వానికి చెందిన కర్ణాటక స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌(కేఎస్‌ఆర్టీసీ), నార్త్‌ వెస్ట్‌ కర్ణాటక రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌(కేడబ్ల్యూకేఆర్టీసీ), కల్యాణ కర్ణాటక రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌(కేకేఆర్టీసీ), బెంగళూరు మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌(బీఎంటీసీ)ల్లో బస్సు టికెట్ల చార్జీలను పెంచుతున్నట్టు మంత్రి హెచ్‌కే పాటిల్‌ ప్రకటించారు.

 “ఈ నాలుగు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లలో పదేళ్ల క్రితం రోజువారీ డీజిల్ వినియోగం రూ.9.16కోట్లు ఉండేది. ఇప్పుడు అది రూ.13.21 కోట్లకు పెరిగింది. ఇక సిబ్బందిపై రోజువారీ ఖర్చు రూ.12.95 కోట్లు నుంచి రూ.18.36 కోట్లు. అందుకే ఈ ఛార్జీ పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది” అని హెచ్కే పాటిల్ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.

ఈ ఛార్జీల పెంపు.. జనవరి 5వ తేదీ నుంచి అమల్లోకి రానుందని ఆర్టీసీ ఉన్నతాధికారులు వెల్లడించారు. తద్వారా సంస్థకు ఒక రోజుకు రూ. 7.84 కోట్ల మేర ఆదాయం సమకూరుతోందని స్పష్టం చేశారు.

కర్ణాటకలో అమలువుతున్న ఉచిత బస్సు పథకం ‘శక్తి’ నాన్-లగ్జరీ బస్సుల్లో కొనసాగుతుందని పాటిల్ చెప్పారు. రూ.2000 కోట్ల మేర ప్రావిడెంట్ ఫండ్ బకాయిలను క్లియర్ చేశామని తెలిపారు. అయితే 13శాతం, 15శాతం ఛార్జీల పెంపు గురించి చర్చించామని, కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలో ఉన్న టికెట్ రేట్లను పరిశీలించి 15శాతం పెంచాలని తుది నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించారు.

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఐదు హామీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి. దాదాపు ఏడాదిన్నరకు పైగా కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం అమలవుతోంది. అయితే, ఈ పథకం కర్ణాటక ప్రభుత్వ ఖజానాకు భారంగా మారింది. నవంబర్‌ నాటికి నాలుగు ఆర్టీసీలకు ప్రభుత్వం రూ.1,694 కోట్లు బకాయి పడింది. ఆర్టీసీలు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి చేరుకున్నాయి.

దీంతో ఉచిత బస్సు భారాన్ని తగ్గించుకునేందుకు, ప్రభుత్వ బకాయిలతో దివాలా తీస్తున్న ఆర్టీసీని గాడిన పెట్టేందుకు ప్రభు త్వం టికెట్‌ ధరల పెంచుతున్నదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వీరి స్ఫూర్తితో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘మహాలక్ష్మి’ పథకం తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్లోనూ ఈ ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ పథకానికి సంబంధించి పలువురు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల కీలక చర్చలు జరిపారు. ఈ విధానం అమల్లో ఉన్న కర్ణాటక, డిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తామని అధికారులు తెలిపారు. దీనిపై సమగ్ర నివేదికను వీలైనంత త్వరగా అందజేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఉగాది నాటికి పథకం అమల్లోకి తెచ్చేలా పనులు వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. కర్ణాటకలో మాదిరిగా తెలుగు రాష్ట్రాలలో కూడా బస్సు చార్జీలు పెంచక తప్పకపోవచ్చని భావిస్తున్నారు.