అదానీ కంపెనీతో తమిళ్ నాడు విద్యుత్‌ ఒప్పందం రద్దు

అదానీ కంపెనీతో తమిళ్ నాడు విద్యుత్‌ ఒప్పందం రద్దు

అదానీ కంపెనీతో విద్యుత్‌ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు తమిళనాడు ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. సౌర విద్యుత్‌ కాంట్రాక్టులను దక్కించుకునేందుకు అదానీ భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఇటీవల అమెరికా పత్రిక ఫైనాన్షియల్‌ టైమ్స్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. 

అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌ (ఎఇఎస్‌ఎల్‌)తో స్మార్ట్‌ మీటర్ల సేకరణ కోసం తమిళనాడు పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పోరేషన్‌ ( టిఎఎన్‌జిఇడిసిఒ) చేసుకున్న ఒప్పందాన్ని స్టాలిన్‌ ప్రభుత్వం రద్దు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అధిక ధరలను కోట్‌ చేశారని, అందుకే ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.

కేంద్ర ప్రభుత్వ పథకం కింద 2023 ఆగస్టులో నాలుగు ప్యాకేజీలుగా టెండర్లు జరిగాయి. చెన్నై సహా ఎనిమిది జిల్లాలను కవర్‌ చేసే టెండర్‌లో ప్యాకేజీ 1కి కి అదానీ సంస్థ 82 లక్షలకు పైగా స్మార్ట్‌ మీటర్లను పంపిణీ చేసేందుకు ఒప్పందం కుదిరినట్లు ఆ వర్గాలు తెలిపాయి. అదానీ సంస్థ కోట్‌ చేసిన ధర అధికంగా ఉన్నందున డిసెంబర్‌ 27, 2024న టెండర్‌ను రద్దు చేసినట్లు వెల్లడించాయి. 

మరో మూడు ప్యాకేజీల టెండర్లను కూడా రద్దు చేశామని తెలిపింది. మరోసారి టెండర్లను ఆహ్వానించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. 2020- 2024 మధ్య లాభదాయకమైన సౌర విద్యుత్‌ కాంట్రాక్టులను దక్కించుకోవడం కోసం అదానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులకు రూ.2029 కోట్ల ముడుపులు ముట్టచెప్పడం లేదా ఇస్తానని వాగ్దానం చేయడం వంటి చేశారని అమెరికా న్యాయశాఖ అక్కడి కోర్టుకు తెలియజేసింది.  

సెకీతో విద్యుత్‌ సరఫరా ఒప్పందాలు కుదుర్చుకునేలా ఆ వ్యక్తులు పలు రాష్ట్రాల విద్యుత్‌ పంపిణీ కంపెనీలను ఒప్పించారు. ఆ విధంగా కొన్ని రాష్ట్ర విద్యుత్‌ కంపెనీలు సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. 2021 జులై, 2022 ఫిబ్రవరి మధ్య కాలంలో ఒరిస్సా, జమ్ము కాశ్మీర్‌, తమిళనాడు, చత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల విద్యుత్‌ పంపిణీ కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి. 

ఇందుకు సంబంధించి 54 పేజీల నేరాభియోగ పత్రాన్ని న్యాయవాదులు కోర్టులో దాఖలు చేసినట్లు అమెరికా పత్రిక ఫైనాన్సియల్‌ టైమ్స్‌ వెల్లడించడంతో ఈ భాగోతం బయటపడింది. నేరాభియోగ పత్రంలో కేటగిరీల వారీగా, వ్యక్తుల వారీగా ఎవరికి ఎంతెంత ముడుపులు ముట్టచెప్పడం లేదా హామీ ఇవ్వడమో చేశారని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. గౌతమ్‌ అదానీ మేనల్లుడు సాగర్‌ అదానీని కూడా ఫెడరల్‌ ప్రాసిక్యూటర్లు ప్రతివాదుల జాబితాలో చేర్చారు.